ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదు
భీమవరం: ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ని ర్లక్ష్యం వద్దని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. నిర్ణీత గడువులోపు బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
భీమవరం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ఏపీ టెట్ పరీక్షలకు 96 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం 95 మందికి 90 మంది, మధ్యాహ్నం 100 మందికి 97 మంది హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు.
ఏలూరులో 66 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సోమవారం 66 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో మధ్యాహ్నం పరీక్షకు 66 మందికి 66 మంది హాజరయ్యారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు.
తాడేపల్లిగూడెం : డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈనెల 17, 18వ తేదీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు తెలిపారు. వర్సిటీ అనుబంధ కళాశాలల్లో ప్రవేశం కోసం ఇంతకు ముందు నమోదు చేసుకున్న దరఖాస్తుదారులకు మాన్యువల్ కౌన్సెలింగ్ వెంకట్రామన్నగూడెంలో జరుగుతుందన్నారు. విద్యార్థులు తగిన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. కౌన్సెలింగ్‌లో సీటు పొందిన వారు ఏ కళాశాలలో సీటు వస్తే అక్కడకు వెళ్లి చేరాల్సి ఉంటుందని తెలిపారు.
ఏలూరు (టూటౌన్): సీఆర్‌ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ సీఆర్‌ఎం ఉపాధ్యాయు లు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆత్మ గౌరవ దీక్ష నిర్వహించారు. ఏపీసీఆర్‌ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో వక్తలు మాట్లాడుతూ కచ్చితమైన జాబ్‌చార్ట్ అమలు చేయాలని, తమకు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న సీఆర్‌ఎం, ఎంటీఎస్ పోస్టులను భర్తీ చేయాలని, వేతనాలు పెంచాలని కోరారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సీఆర్‌ఎంలు తరలివచ్చారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటంలో భాగంగా మంగళవారం ఏలూరు జిల్లా సహకార అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు రాష్ట్ర స హకార సంఘాల ఉద్యోగుల సంఘం జిల్లా అ ధ్యక్షుడు కాళంగి వీరవెంకట సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న స హకార సంఘాల ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని వీర వెంకట సత్యనారాయణ కోరారు.
ఏలూరు(మెట్రో): జిల్లాలో 22ఏ కేసుల పరిష్కారానికి ఈనెల 16న ఏలూరులో మెగా పరి ష్కార వేదికను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో ఉదయం 9 గంటల నుంచి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు.
ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదు


