గళమెత్తిన భవన నిర్మాణ కార్మికులు
ఏలూరు (టూటౌన్): భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ధర్నానుద్దేశించి ఇఫ్టూ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ రమణ మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు గద్దెనెక్కి 17 నెలలు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయలేదన్నారు. సంక్షేమ బోర్డును పునర్నిర్మాణం చేయాలని, 25 లక్షల మంది కార్మికులకు ప్రయోజనాలు చేకూర్చాలని డిమాండ్ చేశారు. తన సొంత డబ్బులు రూ.కోటి (బీఓసీ) బోర్డుకు విరాళంగా ఇస్తానని ఎన్నికల సభలో ప్రకటించిన డిప్యూ టీ సీఎం ఇప్పటివరకు బోర్డుకు జమ చేయలేదన్నారు. ఇఫ్టూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్,రామ్మోహన్, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బి. సోమయ్య, యర్రా శ్రీనివాసరావు, ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు కాకర్ల శ్రీనివాస్, నవడు నెహ్రూ బాబు తదితరులు పాల్గొన్నారు.


