రేషన్ బియ్యం స్వాధీనం
చింతలపూడి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మండంలోని ఫాతిమాపురం అడ్డరోడ్డు వద్ద విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు శనివారం పట్టుకున్నారు. అశోక్ లేలాండ్ వాహనంలో తరలిస్తున్న 35.09 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్ కలపాల సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన కఠారి శ్రీను, ప్రగడవరం గ్రామానికి చెందిన నున్నా శ్రీను, ఫాతిమాపురం గ్రామానికి చెందిన చిలకమ్మ, శంకుచక్రపురం గ్రామానికి చెందిన సీతారాములు అనే వ్యక్తులు చుట్టు పక్కల గ్రామాల రేషన్ కార్డుదారుల నుంచి కేజీ 13 రూపాయలకు కొనుగోలు చేసి వాటిని చాట్రాయి మండలం, మర్లపాలెం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రరావు, వంగర దత్తులకు కిలో 19 రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పినట్లు అధికారులు తెలిపారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి రూ.1.40 లక్షల విలువైన బియ్యం, రూ.8 లక్షల విలువైన వాహనాన్ని సీజ్ చేసినట్లు విజిలెన్స్ ఎస్సై సీహెచ్ రంజిత్ కుమార్ తెలిపారు.
లింగపాలెం: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలతో పాటు శారీరకంగా మానసికంగా, ఆరోగ్యంగా ఉంటారని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు టి.శేఖర్ బాబు చెప్పారు. ధర్మాజీగూడెంలోని శ్రీ సాయి క్రిశాలీస్ ఇంటర్ నేషనల్ స్కూల్ క్రీడా మైదానంలో 69వ రాష్ట్రస్థాయి అండర్–19 నెట్ బాల్ ఛాంపియన్‌షిప్ మూడు రోజుల పాటు జరిగే పోటీలను శనివారం ప్రారంభించారు. పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేఖర్ బాబు మాట్లాడుతూ జీవితంలో ఎదగడానికి విద్యార్థులు చదువుతోపాటు క్రీడలను కూడా ప్రతినిత్యం ప్రాక్టీస్ చేయాలన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఏలూరు జిల్లా ఆర్‌ఐఓ కె. యోహాను, కె. జయరాజు, జె.రవీంద్ర పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నేర పరిశోధనలలో కీలకమైన సాక్ష్యాలను విశ్లేషించడానికి, నిర్ధారించడానికి స్పెక్టోమెట్రీ ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని హైదరాబాద్ సీఎస్‌ఐఆర్–ఐఐసీటీ సీనియన్ సైంటిస్ట్ యూవీఆర్ విజయ సారథి అన్నారు. స్థానిక సీఆర్ రెడ్డి పీజీ కళాశాలలో పీజీ కెమిస్ట్రీ విభాగం, ఐక్యూఏసీ సంయుక్తంగా అతిథి ఉపన్యాస కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయసారథి మాట్లాడుతూ మెటీరియల్స్ (పదార్థాల) విశ్లేషణ కోసం ఉపయోగించే కొన్ని ముఖ్యమైన మాస్ స్పెక్ట్రోమెట్రిక్ సాంకేతికతలను వివరించారు. కార్యక్రమంలో పీజీ కళాశాల కరస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు, డైరెక్టర్ వీఆర్‌ఎస్ బాబు యలమర్తి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కె.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రేషన్ బియ్యం స్వాధీనం
రేషన్ బియ్యం స్వాధీనం


