నిబంధనలు మీరి తరగతులపై ఫిర్యాదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అధికారంలో ఉంటే ఏ చర్య అయినా చెల్లుబాటు అవుతుంది అనుకోవడం అవివేకమని, హైకోర్టు ఆదేశాలు ధిక్కరించి నగరంలో అనుమతి లేకుండా నారాయణ జూనియర్ కాలేజీలో హైస్కూల్ నడుపుతున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కే. లెనిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సీసీకి నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం లెనిన్ మాట్లాడుతూ నగరంలోని మోర్ మార్కెట్ సందులో నారాయణ జూనియర్ కళాశాలలోనే అనుమతులు లేకుండా 6వ తరగతి నుంచి పదవ తరగతి వరకు పాఠశాల నడుపుతున్నారని, గత రెండు సంవత్సరాలుగా కళాశాలలో పాఠశాల నడుపుతూ ఉన్నా విద్యా శాఖ గానీ, ఇంటర్మీడియట్ బోర్డు గానీ అటు వైపు కన్నెత్తి చూడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు ఎం.జయంత్, ఎం.శివ తదితరులు పాల్గొన్నారు.


