ఏడు వారాల దీక్ష.. ఏడుకొండల వాడే రక్ష
● అధిక సంఖ్యలో గోవింద దీక్షలు తీసుకున్న స్వాములు
● శనివారం.. ఏకాదశినాడు దీక్ష చేపట్టడంపై భక్తుల హర్షం
ద్వారకాతిరుమల: శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. అంటూ గోవింద దీక్షాదారులు చేసిన గోవింద నామస్మరణలు, భజనలతో క్షేత్ర పరిసరాలు మారుమ్రోగాయి. ద్వారకాతిరుమల చినవెంకన్న సన్నిధిలో వివిధ ప్రాంతాలకు చెందిన పెద్ద ఎత్తున భక్తులు శనివారం ఏడువారాల గోవింద దీక్షను స్వీకరించారు. పసుపు రంగు దుస్తుల్లో తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తుల మెడలో అర్చకులు మాలలు వేశారు. దీక్ష చేపట్టిన భక్తులంతా స్వామి, అమ్మవార్లను దర్శించి, ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలో ఉన్న దీపారాధన మండపంలో దీపాలు వెలిగించారు. అనంతరం వారు గోవింద నామస్మరణలతో భజనలు చేశారు. కార్తీకమాసంలో.. స్వామివారికి ప్రీతికరమైన రోజు.. అందులోనూ ఉత్పన్న ఏకాదశి నాడు 7 వారాల దీక్షను స్వీకరించడాన్ని భక్తులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 30న ఉదయం ఇరుముడులతో స్వామివారి ఉత్తరద్వార దర్శనం, నిజరూప దర్శనం చేసుకుని దీక్షను విరమిస్తారు. అంతేకాక ముందురోజు జరిగే శ్రీవారి గిరి ప్రదక్షిణలో సైతం దీక్షాదారులు పాల్గొంటారు.
రేపటి నుంచి మండల దీక్షలు
సాధారణంగా భక్తులు 108 రోజుల మహా మండల దీక్ష, 41 రోజుల మండల దీక్ష, 21 రోజుల అర్ధ మండల దీక్ష, ఏడువారాల వ్రత దీక్షలను చేపడతారు. అయితే ఏడువారాల దీక్ష ముగియడంతో సోమవారం నుంచి మండల, వచ్చే నెల 8 నుంచి అర్ధ మండల దీక్షాలు ప్రారంభం అవుతాయి. అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడే భక్తులు ముక్కోటికి 11 లేదా 9 రోజుల ముందు దీక్షలు చేపడతారు.
నిత్య వైదిక కార్యక్రమాలు
దీక్షాదారులు తెల్లవారుజామునే చన్నీటి స్నానాన్ని ఆచరించి, ఆలయానికి చేరుకుంటారు. అనంతరం స్వామివారి దీపారాధన మండపంలో దీపాలు వెలిగించి, గోవిందనామాలు చదువుతారు. ఆ తరువాత ఆలయంలో ప్రదక్షిణలు చేసి, శ్రీవారి తొలి హారతిని అందుకుంటారు. సాయంత్రం సూర్యాస్తమయం తరువాత కూడా ఆలయంలో పూజలు చేస్తారు.
దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలివే
స్వాములకు శ్రీవారి దేవస్థానం ఉచిత దర్శనంతో పాటు, తీర్ధ ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని అందిస్తోంది. అయితే దీక్షలు స్వీకరించాల్సిన తేదీలు, దీక్షలు చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేస్తే దీక్షాదారుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఏడు వారాల దీక్ష.. ఏడుకొండల వాడే రక్ష


