రెస్టారెంట్లలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు
భీమవరం (ప్రకాశంచౌక్): జాయింట్ కలెక్టర్ ఆదేశాలు మేరకు భీమవరంలో శనివారం పలు రెస్టారెంట్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏఎస్‌ఆర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని జువ్వలపాలెం రోడ్, డీఎన్నార్ కాలేజ్ రోడ్‌లోని రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. ఓ రెస్టారెంట్‌లో చికెన్ ఫ్రై రంగులు కలిపి తయారు చేస్తున్నట్టుగా గుర్తించి శాంపుల్ సేకరించి కేసు నమోదు చేశారు. మరో రెండు రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతులు లేవని గుర్తించి నోటీసులు జారీ చేశారు.
ద్వారకాతిరుమల: ఓ భక్తుడు పోగొట్టుకున్న సెల్ ఫోన్ పోలీసుల చొరవతో తిరిగి వెంటనే అతడికి దక్కింది. వివరాల ప్రకారం విజయవాడలోని మొగలరాజపురంకు చెందిన భక్తుడు రాయవరపు వెంకట సాయి దుర్గాప్రసాద్ శ్రీవారి దర్శనార్థం శనివారం ఉదయం బైక్‌పై ద్వారకాతిరుమల క్షేత్రానికి విచ్చేశాడు. తీరా చూస్తే జేబులో ఉండాల్సిన తన సెల్ ఫోన్ కనిపించలేదు. వెంటనే పోలీస్టేషన్‌కు చేరుకుని మార్గ మధ్యలో ఎక్కడో ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశాడు. వెంటనే ఎస్సై టి.సుధీర్ లొకేషన్ ఆధారంగా సదరు సెల్‌ఫోన్ ద్వారకాతిరుమల మండలంలోని సూర్యచంద్రరావుపేట గ్రామ పొలాల్లో ఒక పసువుల కాపరి వద్ద ఉన్నట్టు గుర్తించారు. అతడికి ఫోన్ దొరికినట్టు తెలుసుకుని, వెంటనే ఫోన్‌ను దుర్గాప్రసాద్‌కు ఇప్పించారు.
గణపవరం: మండలంలోని అర్థవరం పోస్టాఫీసులో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో పోస్టల్ ఇన్‌స్పెక్టర్ టి.సుబ్రహ్మణ్యం శనివారం విచారణ చేశారు. పోస్ట్‌మాస్టర్ ఖాతాదారుల అక్కౌంట్ల నుంచి నగదు అక్రమంగా స్వాహా చేశారని ఖాతాదారులు ఆందోళన చేసిన నేపథ్యంలో పోస్టల్‌శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా పోస్టాఫీసులోని రికార్డులు పరిశీలించారు. ఖాతాదారుల డబ్బు తిరిగి వారికి వచ్చేలా కృషి చేస్తామని సుబ్రహ్మణ్యం తెలిపారు.


