కూలిన చెట్టును ఢీకొన్న బస్సు
పెంటపాడు: తుపాను, ఈదురు గాలుల నేపథ్యంలో ప్రత్తిపాడులో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టును ఆర్టీసీ బస్సు మంగళవారం సాయంత్రం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వై.జంక్షన్ దుర్గమ్మ గుడి నుంచి జాతీయ రహదారి వెళ్లే ప్రాంతంలో రెండు కొబ్బరి చెట్లు తుపాను వల్ల నేలకొరిగాయి. తణుకు వైపు రోడ్డు పక్కగా చెట్టు ఉండడంతో గమనించని ఆర్టీసీ డ్రైవర్ అటుగా బస్సును పోనివ్వడంతో ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు జ్యోతి (దువ్వ), అనిత (తేతలి) యాకూబ్ (తణుకు)కు గాయాలయ్యాయి. వారితో పాటు, ఇతర ప్రయాణికులను వేరే బస్సులో తణుకు పంపించారు. పెంటపాడు ఎస్సై స్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
జంగారెడ్డిగూడెం: మోంథా తుపాను బాధితుల కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ పట్టణాధ్యక్షుడు కర్పూరం గుప్త మాట్లాడుతూ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయ రాజు, బత్తిన నాగలక్ష్మి నేతృత్వంలో జంగారెడ్డిగూడెం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున బత్తిన చిన్న కళ్యాణ మండపం వద్ద తుపాను బాధితులకు షెల్టర్, భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బత్తిన చిన్న, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


