మోంథా వణుకు
భీమవరం: ముంచుకొస్తున్న మోంథా తుపాను జిల్లాలోని రైతులను కలవరపెడుతోంది. ఇప్పటికే పలుచోట్ల వరిపైరు నేలవాలి నష్టం ఏర్పడటంతో రానున్న తుపాను మరింత చేటుతెచ్చేలా ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో సార్వా సీజన్‌లో 2.08 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సీజన్ ప్రారంభం నుంచి సాగునీటి ఇబ్బందులు, ఎరువుల కొరత, ఎలుక బెడద, అన్నదాత సుఖీభవ సాయం సక్రమంగా అందకపోవడం వంటి సమస్యలతో నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే సమయంలో ఎడతెగని వర్షాలు, వాయుగుండాలతో సతమతమవుతున్నా డు. తాజాగా తుపాను హెచ్చరికలతో పంటను కాపాడుకోవడం ఎలా అంటూ గుబులు చెందుతున్నాడు.
కల‘వరి’పాటు
మోంఽథా తుపాను రైతులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. జిల్లాలోని తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఇప్పటికే వరి పంట మాసూళ్లు ప్రారంభంకాగా కొన్ని మండలాల్లో పంట చేతికి వచ్చే స్థితిలో ఉంది. మరికొన్ని చోట్ల గింజలు గట్టిపడడం, వరిపైరు ఈనిక దశలో చేలు ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కోతకు వచ్చిన పంటను ఎలా ఒడ్డుకు చేర్చాలో తెలియక రైతులు ఇబ్బంది పడుతున్నారు. గింజలు గట్టిపడే దశ, పాలుపోసుకునే దశలో ఉన్న పైరు వర్షాలు, తుపాను కారణంగా నేలవాలితే తెగుళ్లు సోకడంతో పాటు పూతదశలో ఉన్న పైరు గింజలు గట్టిపడక తప్పలుగా మారి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో 4 వేల ఎకరాల్లో..
భారీ వర్షాలకు జిల్లాలో సుమారు 4 వేల ఎకరాలకు పైగా పంట నేలవాలినట్టు వ్యవసాయశాఖ అంచనా వేయగా రైతులు మాత్రం ఇంకా ఎక్కువగానే ఉంటుందంటున్నారు. నేలవాలిన పైరు దుబ్బులను కట్టలు కట్టి పంటను రక్షించుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మోంథా తుపాను మంగళవారం నాటికి తీవ్ర ప్రభావం చూపుతుందని వాతా వరణశాఖ హెచ్చరించడంతో పాటు జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేయడం మరింత భయపెడుతోంది. జిల్లాలో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో పొలాల్లోని నీరు బయటకు వెళ్లక పైరు కుళ్లిపోయే ప్రమాదముందని రైతులు అంటున్నారు.
తుపాను ప్రభావంతో అధిక వర్షాలు కురిస్తే పంటకు నష్టం ఏర్పడే ప్రమాదముంది. వరి పంట కోతకు వచ్చిన పొలాల్లో నీరు నిలిచిపోకుండా కాలువలు ఏర్పాటుచేసుకుని నీటిని బయటకు తీసివేయాలి. కోతకు వచ్చిన పంట నేలవాలితే వెన్నులపై 5 శాతం ఉప్పు ద్రావణాన్ని లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్లు నివారణకు ఎకరాకు ప్రోపికొనజోల్ 200 మిల్లీలీటర్లు లేదా హెక్సాకొనజోల్ 400 మిల్లీలీటర్ల మందును పిచికారీ చేయడం ద్వారా గింజలు రంగు మారకుండా, పొడ తెగులు, మానిపండు తెగులు సోకకుండా నివారించవచ్చు.
– జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, భీమవరం
వరి పైరు దుబ్బులను కట్టలు కట్టిన దృశ్యం
తణుకు మండలం తేతలిలో నేలవాలిన వరి చేను
రైతుల గుండెల్లో తుపాను
జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో సార్వా సాగు
భారీ వర్షాలకు సుమారు 4 వేల ఎకరాల్లో నేలవాలిన పంట
తుపాను ప్రభావంతో నష్టపోతామంటున్న రైతులు
నివారణ చర్యలు పాటించాలని వ్యవసాయశాఖ సూచన
మోంథా వణుకు
మోంథా వణుకు
మోంథా వణుకు


