తుపానును ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధం
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో మోంథా తుపా నును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి తుపాను సన్నద్ధత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లా లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎక్కడా ప్రాణ, ఆస్థి నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నరసాపురం డివిజన్‌లో 10, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 8, భీమవరం డివిజన్‌లో 10 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామన్నారు.
ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం
జిల్లాలోని 7 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 90 మంది సిబ్బందిని, అత్యవసర పరికరాలు, వాహనాలను సిద్ధంగా ఉంచినట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లా 7 అగ్నిమాపక వాహనాలు, 10 నీటిని తోడే యంత్రాలు, 80 లైఫ్ జాకెట్లు, 40 లైఫ్ బాయ్స్, 30 రోప్‌లు, చెట్లను నరకడానికి ఉపయోగించే యంత్రాలు 12 సిద్ధం చేశామన్నారు. ప్రత్యేకంగా చెట్లను నరకడానికి 12 బృందాలతో 24 మందిని నియమించామన్నారు.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
జిల్లా కలెక్టరేట్‌లో 08816 299219, భీమవరం ఆర్డీఓ కార్యాలయంలో 9848413739, 87907 31315, నరసాపురం ఆర్టీఓ కార్యాలయంలో 9391185874, తాడేపల్లి ఆర్డీఓ కార్యాలయంలో 9381701036, 9849712358 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేశారు.
పాఠశాలలకు సెలవులు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సోమ, మంగళవారాలు సెలవులు ప్రకటించారు. ఆదేశాలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
ప్రత్యేక పర్యవేక్షణ అధికారి రాక
పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించిన ప్రత్యేక పర్యవేక్షణ అధికారి వి.ప్రసన్న వెంకటేష్ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, ముందస్తు చర్యలపై సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఏదైనా సమాచారాన్ని 8639541520 నంబర్‌లో సంప్రదించి ప్రత్యేకాధికారికి తెలియజేయవచ్చు.
కలెక్టర్ నాగరాణి


