చంద్రబాబుది దుర్మార్గ పాలన
● మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి
● మాజీ మంత్రి కొట్టు డిమాండ్
తాడేపల్లిగూడెం అర్బన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సీఎం చంద్రబాబు దుర్మార్గ పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. స్థానిక 4వ వార్డులోని గాంధీ బొమ్మ సెంటర్‌లో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చార న్నారు. వాటిని చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించకపోవడం నిర్లక్ష్య వైఖరికి తార్కాణమన్నారు. సుమారు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలన చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క మెడికల్ కళాశాలను కూడా స్థాపించలేదన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు వైద్య విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధనార్జనే ధ్యేయంగా కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కల్తీ మద్యం దందా
రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని, దీనిని తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ మంత్రి కొట్టు ఆరోపించారు. జగన్ పాలనలో మద్యాన్ని క్రమపద్ధతిలో ప్రభుత్వం ద్వారా విక్రయిస్తే చంద్రబాబు రాష్ట్రంలో సుమారు 85 వేల బెల్టు షాపులు ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. మద్యంపై ఆదా యం 4 శాతమే వస్తుందని చెప్పడం వారి దోపిడీతనానికి నిదర్శనమన్నారు. గీత కార్మికులకు మద్యం షాపుల ఏర్పాటు పేరుతో మద్యం దుకాణాలను అధికం చేశారని ఆరోపించారు. కోటి సంతకాల కార్యక్రమాన్ని పట్టణవాసులు జయప్రదం చేయా లని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలుకులూరి ధర్మరాజు, చామన సూర్యచంద్రరావు, హసీనా బీబీ, షేక్ నాగూర్, బోళెం రమణ, నరెడ్ల వీరబాబు, ప్రసాద్, తగరంపూడి మురళీ, మస్తాన్ వలి, సిర్రాపు శాంతకుమార్, కట్టా నాగరాజు, తోట గోపి, పాలూరి శివ, జడ్డు హరిబాబు, ముప్పిడి సంపత్‌కుమార్, మేడపాటి రమేష్‌రెడ్డి, బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


