నరసాపురం టీడీపీలో వర్గపోరు
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎదుట నిరసన
నరసాపురం: నరసాపురం టీడీపీలో వర్గపోరు మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో రోడ్డెక్కింది. ఏఎంసీ ప్ర మాణ స్వీకార ఆహ్వాన పత్రికలో మాజీ ఎమ్మెలే బండారు మాధవనాయుడు పేరు వేయలేదని మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న బండారు వర్గీయులు ఆదివారం పట్టణంలో మో టార్ సైకిళ్లతో నిరసన ప్రదర్శన చేశారు. ఏఎంసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతున్న స్థానిక గోదావరి గట్టున ఉన్న అల్లూరి సాంస్కృతిక ప్రదర్శన కేంద్రం వద్దకు చేరుకుని గొడవ చేశారు. కార్యక్రమానికి హజరైన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఆపి టీడీపీ నరసాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి పొత్తూరి రామరాజును తప్పించి పార్టీని కాపాడాలని డిమాండ్ చేశారు. దీంతో అల్లూరి సాంస్కృతిక కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరకు మంత్రికి వినతిపత్రం ఇచ్చి ఆందోళన విరమించారు. లోపల ఏఎంసీ కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలోనే బయట బండారు వర్గీయులు ఆందోళన చేయడం గమనార్హం. అయితే ఆందోళనను ఏ మాత్రం పట్టించుకోకుండానే ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు.


