ఆక్వాకు తుపాను గండం
మేత తగ్గించాలి
● చేపల, రొయ్యల రైతుల ఆందోళన
● ఆక్సిజన్ సమస్య తలెత్తే ప్రమాదం
కై కలూరు: అమెరికా సుంకాల దెబ్బకు విలవిల్లాడుతున్న ఆక్వా రంగానికి మోంథా సూపర్ సైక్లోన్ రూపంలో మరో విపత్తు ముంచుకొస్తోంది. చేపల, రొయ్యల ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న కొల్లేరు ప్రాంతంపై దీని ప్రభావం కనిపించనుంది. మోంథా తుపాను నష్టంపై ఆక్వా రైతులు ఆలోచనలో పడ్డారు. ఆక్వా సాగు అధికంగా ఉఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ముప్పును ఎదుర్కొవడం ఎలా? అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు.
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 2.90 లక్షల ఎకారల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. వీటిలో చేపలు 1.80 లక్షల ఎకరాలు, రొయ్యలు 1.10 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉండగా, ఏడాది టర్నోవర్ రూ.18 వేల కోట్లు పైనే ఉంది. ప్రస్తుత చేపల చెరువుల్లో 700 గ్రాముల నుంచి కేజీ బరువు చేప పెరుగుతుంది. ఇటీవల అల్పపీడనం కారణంగా విస్తారంగా కురిసిన భారీ వర్షాలకు ఆక్వా చెరువుల్లో నీరు గట్ల అంచుల వరకు చేరింది. ఈదుర గాలులకు సైతం నీటి అలల తాకిడికి చెరువు గట్లు బలహీనపడ్డాయి. ఇలాంటి తరుణంలో తుపాను భయం అణువణువునా ఆక్వా రైతుల్లో కనిపిస్తోంది.
ఆక్సిజన్ సమస్య తలెత్తే ప్రమాదం
వాతావరణం మారినప్పుడల్లా ఆక్వా రైతులను డీవో(ఆక్సిజన్ సమస్య) పట్టి పీడిస్తోంది. సాధారణంగా చేపల, రొయ్యల చెరువుల్లో 5 పీపీఎం నుంచి 6 పీపీఎం వరకు ఆక్సిజన్ నిష్పత్తి ఉండొచ్చు. విస్తార వర్షాలకు చెరువుల్లో పీపీఎం 3.4కి పడిపోయింది. పీహెచ్ తగ్గితే చేపలకు ఊపిరాడక తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఇప్పటికే చేపల్లో రెడ్ డిసీజ్, మోర్టాలిటీ, రొయ్యల సాగులో విబ్రోయో, వైరస్, తెల్ల మచ్చ తెగుళ్లు రైతులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. తుపాను కారణంగా గట్లు తెగి నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు.
తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● చెరువు నీరు పెరగకుండా గట్టు నీటి మట్టం 20–30 సెం.మీ. తగ్గించాలి.
● పగుళ్లు, బలహీన స్థానాలు ఉంటే ముందుగానే మట్టి, రాళ్లతో పటిష్టం చేయాలి.
● విద్యుత్ పోయే అవకాశం ఎక్కువ. డీజిల్ ఎరియేటర్లు, జనరేటర్లు, తగిన ఇంధనం నిల్వ ఉంచుకోవాలి.
● తుపానుకు ముందు ఆక్సిజన్ బూస్టర్, హైడ్రోజన్ పెరాకై ్సడ్ ఉపయోగించాలి.
● తుపానుకు ముందు రోజు నుంచే మేత మొత్తాన్ని 30–40 శాతం తగ్గించాలి.
● చెరువులో వల వేసే పని, సున్నం చల్లే పనులు నిలిపివేయాలి
● చెరువులోకి నీరు బాగా ఎక్కితే ఒక్కసారిగా తీసేయకుండా 3–4 గంటల వ్యవధితో నెమ్మదిగా బయటకు పంపాలి.
వాతావరణ మార్పుల సమయంలో ఆక్వా రైతులు మేతలను తగ్గించడం ఉత్తమం. భారీ వర్షాలకు కొత్త నీరు ప్రవేశించినప్పుడు చేపలు బయటకు దూకడానికి ప్రయత్నిస్తాయి. వలలను సిద్ధం చేసుకోవాలి. చెరువు గట్లపై మేతల దాణాలను వర్షానికి తడవకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత ఆక్వా ల్యాబ్‌లో చెరువు నీటిని పరీక్ష చేయించాలి. – డాక్టర్ పి.రామ్మోహనరావు,
విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీష్
ఆక్వాకు తుపాను గండం
ఆక్వాకు తుపాను గండం
ఆక్వాకు తుపాను గండం


