పేకాట క్లబ్బులతో భీమవరంలో రూ.కోట్ల దోపిడీ
భీమవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గంలో 14 నెలల పాటు విచ్చలవిడిగా పేకాట క్లబ్బుల నిర్వహణ వెనుక కూటమి నేతల ప్రమేయం ఉందని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పారు. రెండు నెలలుగా పేకాట క్లబ్బుల నిర్వహణ నిలిచిపోవడంతో ఆదాయం తగ్గి పోలీసు అధికారులపై ఆరోపణలు చేస్తూ భీమవరం డీఎస్పీ ఆర్‌జీ జయసూర్యను బలిపశువును చేస్తున్నారని ఆరోపించారు. భీమవరంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార కూటమి నాయకులు క్లబ్బుల నుంచి ప్రతినెలా రూ.10 లక్షల వరకు వసూలు చేయడమేగాక కీలక నేత ఒకరు ఒక క్లబ్బులో స్వయంగా రూ.5 లక్షల బోర్డు నిర్వహించారని, బ్రాందీ షాపుల నుంచి ప్రతి నెలా రూ.4.50 లక్షలు వసూలు చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయని చెప్పారు. భీమవరంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నట్టు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ తెలుసన్నారు. రెండు నెలలుగా పేకాట క్లబ్బుల్ని మూయించడంతో.. 14 నెలలుగా రూ.కోట్లు దండుకున్న నేతలు ఆదాయం కోల్పోయి ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. పవన్‌కల్యాణ్ దృష్టికి డీఎస్పీ వ్యవహారం తీసుకెళ్లిన నేతకు.. ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆక్రమించుకుని సైకిల్ స్టాండ్ నిర్వహణ, మంచినీటి చెరువు పేరుతో తక్కువ ధరకు 50 ఎకరాల భూమిని లాక్కుని రైతులను మోసగించిన చరిత్ర ఉందని అందరికీ తెలుసని పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)పై ఆరోపణలు చేశారు. క్లబ్బుల వ్యవహారంలో డీఎస్పీపై విచారణ అవసరం లేదని, పట్టణ ప్రజలను అడిగితే మొత్తం బండారం బయటపడుతుందని పేర్కొన్నారు.
కలెక్టరేట్‌ను తరలించడానికి అవకాశం లేదు
భీమవరం నుంచి కలెక్టరేట్‌ను వేరే ప్రాంతానికి తరలించడానికి చట్టబద్ధత లేద న్నారు. అందువల్లనే ఉండి ఎమ్మెల్యే పెద అమిరంలో కలెక్టరేట్ ఏర్పాటుకు అవసరమైతే ఉండి నుంచి పెద అమిరాన్ని భీమవరంలో కలుపుతామన్నారని గుర్తుచేశారు.
మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్


