ముంచెత్తిన చిన కాపవరం డ్రెయిన్
ఆకివీడు: మండలంలోని చినకాపవరం డ్రెయిన్ భారీ వర్షాలకు పొంగి ప్రవహించింది. స్థానిక సమతానగర్‌లోని వీరమల్లు కాలనీ వద్ద గట్లపై నుంచి ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వెంకయ్య వయ్యేరు పంట కాల్వలోని అదనపు నీటిని చినకాపవరం డ్రెయిన్‌లోకి గత మూడు రోజులుగా వదిలేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి పంట కాల్వలోకి వేలాది క్యూసెక్కుల నీరు చేరడంతో గట్లకు గండ్లు పడకుండా అదనపు నీటిని డ్రెయిన్‌లోకి వదిలేస్తున్నారు. దీంతో చినకాపవరం డ్రైయిన్ ఆయకట్టు భూముల్ని ముంపునకు గురిచేయడమే కాకుండా, డ్రెయిన్ పొంగి ప్రవహించడంతో స్థానిక సమతానగర్ వద్ద వీరమల్లు కాలనీ ప్రాంతంలో గట్లపైకి చొచ్చుకువస్తుంది. ఆదివారం రాత్రికి మరింతగా నీరు పెరిగే అవకాశం ఉండటంతో కాలనీలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, సమతానగర్‌లోని రోడ్లు, ఇళ్లు ముంపునకు గురవుతాయని ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనతో ఉన్నారు. చినకాపవరం లాకుల వద్ద అన్ని గేట్లూ ఎత్తివేయడంతో ముంపునీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.


