కార్మికుల హక్కులకు భంగం
ఏలూరు (టూటౌన్): కేంద్రంలోని మోదీ–షా ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుందని ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్ధా వెంకట్రావు అన్నారు. నవంబర్ 1 నుంచి 4 వరకు ఏలూరులో జరిగే ఇఫ్టూ రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్‌ను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం ఇఫ్టూ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇఫ్టూ నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.వి.రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావులు మాట్లాడుతూ కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో భద్రత కరువైందని, కార్మిక హక్కులు రక్షించుకునేలా చైతన్యవంతం చేసేందుకు ఇఫ్టూ క్లాసులను నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ప్రెసిడెంట్ కాకి నాని, ఇఫ్టూ నాయకురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


