సాంకేతికతతో చిన్నారి ఆచూకీ లభ్యం
తణుకు అర్బన్: అదృశ్యమైన చిన్నారి ఆచూకీని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొని ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈమేరకు తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో శనివారం తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన ధనకొండ దుర్గమ్మ తన సోదరి రెండు కుటుంబాలతో గంగిరెద్దులు ఆడిస్తూ ఉపాధి కోసం దీపావళి ముందురోజు తేతలి శ్మశానవాటిక సమీపంలోని బస్‌షెల్టర్‌లో తలదాచుకున్నారు. ఈనెల 21వ తేదీన మధ్యాహ్నం గంగిరెద్దులు ఆడించి నివాస ప్రాంతానికి వచ్చిన వారికి సోదరి కుమార్తె వీరమ్మ కనిపించకపోవడంతో తణుకు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిన్నారి వీరమ్మను ఆకివీడు రైల్వేస్టేషన్‌లో కనిపెట్టారు. పెద్దలంతా బయటకు వెళ్లిన సమయంలో చిన్నారి తేతలి జాతీయ రహదారిపైకి వచ్చి ఆటో ఎక్కి బస్టాండ్ వద్ద దిగగా అక్కడ నుంచి ఆకివీడుకు చెందిన యాచక వృత్తిలో ఉన్న ఇద్దరు పాపవద్ద ఎవరూ లేకపోవడంతో తమ వెంట తీసుకువెళ్లారు. ఈ వ్యవహారమంతా సీసీ పుటేజీలు, సాంకేతికపరంగా సేకరించిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి అత్తిలి, గణపవరం, ఆకివీడు ప్రాంతాల్లో జల్లెడపట్టగా చివరకు ఆకివీడు రైల్వేస్టేషన్‌లో పాప నేలపై పడుకుని ఉండడాన్ని చూసి గుర్తించి తణుకు తీసుకువచ్చారు. అయితే ఆకివీడుకు చెందిన భార్యాభర్తలు సైతం ఉద్దేశ్యపూర్వకంగా తీసుకువెళ్లలేదని, ఒంటరిగా ఉందని తీసుకువెళ్లి సాకుతున్నట్లుగా డీఎస్పీ విశ్వనాథ్ చెప్పారు. రూరల్ సీఐ బి.కృష్ణకుమార్ నేతృత్వంలో చిన్నారి అదృశ్యం ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్సైలు కె.చంద్రశేఖర్, డి.ఆదినారాయణ, జె.సతీష్, పి.ప్రేమరాజులతోపాటు హెడ్‌కానిస్టేబుల్ ఎ.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు షేక్ అన్వర్, మలక శ్రీనివాస్, ఎ.రవీంద్ర, వి.మహేష్, ఎస్.భాస్కరాచారిలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పాపను తల్లితండ్రులకు అప్పగించారు.
తేతలిలో అదృశ్యమై ఆకివీడులో దొరికిన చిన్నారి


