అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ముసునూరు: పొలానికి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది. ఎస్సై ఎం చిరంజీవి తెలిపిన వివరాలు ఇవి. మండలంలోని వేల్పుచర్లకు చెందిన జోగి వెంకట రంగారావు(49) శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో అతడి కోసం వెదికినా ఆచూకీ లభించలేదు. శనివారం గ్రామ శివారులోని నీటి వరల తొట్టిలో పడి మృతి చెందిన స్థితిలో స్థానికులు కనుగొన్నారు. రంగారావు సోదరుడు జోగి లక్ష్మణరావు ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఉండి: నమ్మిన రైతులను ఓ బ్యాంకు ఉద్యోగి నిలువునా ముంచేశాడు. అతనిపై బ్యాంక్ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ ఆధ్వర్యంలో కోలమూరు బ్రాంచ్‌లో 2022–24 మధ్య కాలంలో పైలా దుర్గారావు బ్రాంచ్ ఇన్‌చార్జిగా పనిచేశాడు. ఈ కాలంలో రైతులు బ్యాంకులో పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్న బంగారం నుంచి 140 గ్రా. బంగారాన్ని దొంగిలించి ఇతర ప్రాంతంలో అమ్మేసుకున్నాడు. గత కొంత కాలం నుంచి ఉండి రూరల్ బ్యాంక్‌లో జరిగిన అవినీతిని వెలికితీసే కార్యక్రమంలో భాగంగా ఈ విషయం బయటపడింది. దీంతో దుర్గారావుపై ఉండి కోఆపరేటివ్ రూరల్ బ్యాంకు కార్యదర్శి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


