2న శ్రీవారి తెప్పోత్సవం
ద్వారకాతిరుమల: చిన వెంకన్న తెప్పోత్సవానికి శ్రీవారి పుష్కరిణి (నృసింహ సాగరం) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 2న రాత్రి స్వామివారి తెప్పోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా పుష్కరిణి గట్లపై ఉన్న ముళ్ల పొదలను, పిచ్చిమొక్కలను ఇప్పటికే తొలగించారు. ప్రస్తుతం విద్యుద్దీప అలంకారాల పనులు జరుగుతున్నాయి. అలాగే పుష్కరిణిని బోరు నీటితో నింపుతున్నారు. ఉత్సవం జరిగే రోజు రాత్రి స్వామివారు ఉభయ దేవేరులతో కలసి తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగి, 8 గంటల సమయంలో పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. ఆ తరువాత తెప్పోత్సవం ప్రారంభం అవుతుందని, భక్తులు ఈ వేడుకలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి కోరారు.


