అన్నదాత వెన్నులో వణుకు
సాక్షి, భీమవరం: ఖరీఫ్ పంట కీలక వెన్నుదశలో ప్రతికూల వాతావరణం రైతులను వణుకు పుట్టిస్తోంది. మరో రెండు వారాల్లో జిల్లా అంతటా వరి కోతలు ముమ్మరం కానున్న తరుణంలో అల్పపీడనం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రస్తుత వర్షాలు, గాలులు తీవ్రతకు పంట నేలకొరిగి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
స్వల్పకాలిక రకాలు
జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో తొలకరి సాగు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్, అత్తిలి, తణుకు, ఇరగవరం, గణపవరం, వీరవాసరం, పెనుమంట్ర, పోడూరు, భీమవరం తదితర ప్రాంతాల్లోని ఏడు వేల ఎకరాల్లో పీఆర్ 126, విత్తనం కోసం సాగుచేసిన ఎంటీయూ 1121 స్వల్పకాలిక రకాలు కోతలు పూర్తయ్యాయి. అధిక శాతం విస్తీర్ణంలో చిరుపొట్ట దశ నుంచి పూత దశల్లో ఉంది. సాగు ఆలస్యమైన ఆచంట, యలమంచిలి, నరసాపురం ఏరియాలో నవంబరు చివరిలోను, మిగిలిన ప్రాంతాల్లో మరో పది రోజుల్లో వరికోతలు మొదలవుతాయని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలో 24 వేల ఎకరాలకు ఇప్పటికే ఆరు వేల ఎకరాల్లో కోతలు పూర్తి చేసుకుని పంటను ఒబ్బిడి చేసుకునే పనిలో రైతులు ఉన్నారు.
ఎడతెగని వాన
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా జిల్లా అంతటా చలిగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం జిల్లాలో 94 మి.మీ., బుధవారం 478 మి.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం భీమవరం, ఉండి, వీరవాసరం, పాలకొల్లు తదితర చోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిపివ్వకుండా వర్షం కురిసింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడి మరో వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. పల్లపు పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోతోంది. గాలులు, వర్షాలకు వెన్ను బరువెక్కి చాలాచోట్ల పొలాల్లోని వరిపంట నేలకొరుగుతోంది. ప్రస్తుత దశలో వరి నీట మునగడం వలన గింజ తాలుగా మారిపోయి దిగుబడులు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాయుగండం
జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు
అధిక శాతం విస్తీర్ణంలో వెన్నుపై వరి పంట
తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఇప్పటికే 25 శాతం విస్తీర్ణంలో వరి కోతలు
మరో పదిరోజుల్లో జిల్లా అంతటా మొదలుకానున్న మాసూళ్లు
చివరిలో ఆందోళన కలిగిస్తున్న అల్పపీడనం


