జాగ్రత్తలు పాటించాలి
ప్రస్తుత దశలో నష్టనివారణ చర్యలు ద్వారా పంటను సంరక్షించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఈ జాగ్రత్తలు పాటించాలని మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.ఎంవీ కృష్ణాజీ తెలిపారు.
● పొట్ట, పూత దశలో పైరు ఒకటి నుంచి రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు నీట మునిగితే కంకి పూర్తిగా బయటకు రాకపోవడం, పుష్పాలలో నీరు చేరడం వలన ఫలదీకరణ శక్తి కోల్పోయి తాలు గింజలు ఏర్పడతాయి.
● పూత దశలో వర్షం పడితే, పుష్పాలలోనికి నీరుచేరి మానుకాయ తెగులు ఆశించే అవకాశం ఉంది. నివారణకు వర్షాలు ముందు జాగ్రత్త చర్యగా చిరుపొట్ట దశలో లీటరు నీటికి 1.0 మి.లీ ప్రొపికొనజోల్ 25 ఈసీ మందు కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి.
● పాలు పోసుకునే దశలో రెండు మూడు రోజులు కన్నా ఎక్కువగా పంట నీట మునిగితే పిండి పదార్థాలు గింజల్లో చేరక గింజ బరువు తగ్గి తద్వారా దిగుబడి, నాణ్యత తగ్గుతాయి. ఈ దశలో గింజ రంగు మారకుండా లీటరు నీటికి 1.0 గ్రాముల కార్బెండిజమ్, లేదా 2.0 గ్రాముల కార్బెండిజమ్ + మాంకోజెబ్ కలిసిన మందు, లేదా 1.0 మి. లీ ప్రోపికోనజోల్ కలిపి పిచికారీ చేయాలి.
● అధిక వర్షాలకు పడిపోయిన చేలల్లో మాగుడు లేదా పాము పొడ తెగులు ఆశించే అవకాశం ఉన్నందున లీటరు నీటికి 2.0 మి.లీ హెక్సాకొనజోల్ లేక 2.0 మి.లీ వాలిడామైసిన్ లేక 1.0 ప్రొపికొనజోల్ లేక 0.4 గ్రా. ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ 25 శాతం, టెబుకొనజోల్ 50 శాతం కలిపి పిచికారీ చేయాలి.
● గింజ గట్టిపడే దశ నుంచి కోత దశ చేను పడిపోకుండా ఉండి, నిద్రావస్థ కలిగిన రకాల్లో నష్టం తక్కువగా ఉంటుంది. నిద్రావస్థ లేనటువంటి బీపీటీ 5204 వంటి రకాలు నీటమునిగితే గింజ మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. నిద్రావస్థ ఉన్న రకాల్లో కూడా చేను పడిపోయి వారం రోజులకన్నా ఎక్కువగా నీట మునిగినట్టైతే గింజలలో నిద్రావస్థ తొలిగి చేనుపైనే మొలకవచ్చే అవకాశం ఉంది. నివారణకు 5 శాతం ఉప్పు ద్రావణం (లీటరు నీటికి 50 గ్రా ఉప్పు కలిపి) పంటపై పిచికారీ చేయాలి.
● గింజ తోడుకునే లేదా గట్టిపడే దశలో వెన్ను బరువుకు మొక్కలు కొద్దిపాటి గాలి, వర్షాలకే కణుపుల వద్ద విరిగి పడిపోతాయి. దీనివల్ల పిండి పదార్థం గింజలకు సరిగా చేరక గింజ బరువు తగ్గడం, తాలు గింజలు ఏర్పడి దిగుబడి తగ్గిపోతుంది. ధాన్యం మిల్లింగ్ సమయంలో విరిగిపోయి నూక ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. యంత్రాలతో కోత కోసేందుకు ఎక్కువ సమయం పట్టడం వల్ల కోతఖర్చు పెరిగిపోతుంది. వీలైనంత తొందరగా దుబ్బులను లేపి నిలబెట్టి కట్టలుగా కట్టాలి.


