దళారులతో నిర్వాసితులకు సమస్యలు
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సమస్యలు సృష్టిస్తున్న దళారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నిర్వాసితులతో కలిసి గురువారం జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం మండలం కొరుటూరు, గాజులగొంది, చీడూరు, టేకూరు గ్రామాలకు చెందిన నిర్వాసిత గిరిజనులు జీలుగుమిల్లి మండలం తరలివచ్చినట్లు తెలిపారు. వీరికి పి.నారాయణపురం సమీపంలో సుమారు 250 ఎకరాలను భూమికి భూమిగా ప్రభుత్వం కేటాయించగా.. గత ప్రభుత్వంలో పలు రకాల పంటలు వేసుకుని జీవనం సాగించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరు దళారులు ఆ భూముల్లో సమస్యలను సృష్టిస్తూ నిర్వాసితులను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. భూముల్లో వ్యవసాయం చేయనీయకుండా అడ్డుకుంటున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భూములపై అన్ని హక్కులు నిర్వాసితులకే ఉన్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని, అలాగే నిర్వాసితులను ఇబ్బంది పెడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ఉదయ్‌కు, పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రం అందించారు. ఎంపీటీసీ సు న్నం సురేష్, నాయకులు తగరం రాంబాబు, మాజీ సర్పంచ్ కోర్సా వెంకటేశ్వరరావు, నిర్వాసిత కాలనీ సర్పంచ్ పి.రామ్‌గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ అరగంటి పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.


