విమాన యానం.. తెలుగుకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

విమాన యానం.. తెలుగుకు ప్రోత్సాహం

Oct 24 2025 8:08 AM | Updated on Oct 24 2025 8:08 AM

విమాన

విమాన యానం.. తెలుగుకు ప్రోత్సాహం

విమాన యానం.. తెలుగుకు ప్రోత్సాహం

సంతోషంగా ఉంది

నిడమర్రు: విద్యార్థులు, తల్లిదండ్రులు గణితం, సైన్స్‌లో నూటికి, నూరు వస్తే భవిష్యత్‌ అని భావిస్తారు. అదిశగా ఆయా సబ్జెక్టులపై దృష్టి పెట్టి, తెలుగుపై తక్కువ శ్రద్ధ పెడుతుంటారు. దీంతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు తెలుగుపై ఆసక్తి పెంచేలా వినూత్న హామీ ఇచ్చారు. ఎంత మందికి తెలుగులో 100 మార్కులు సాధిస్తే, అంతమందిని విమాన ప్రయాణ అనుభూతి కలిగిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఏడాది విడుదలైన పది ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులు తెలుగు భాషలో 100 మార్కులు తెచ్చుకోవడంతో తాజాగా ఆ ఉపాధ్యాయుడు తన హామీని నిలబెట్టుకున్నారు. ఆ ఇద్దరు విద్యార్థులను తన సొంత ఖర్చులతో విమానంలో వేరే రాష్ట్రానికి తీసుకువెళ్లి వారి కలను నెరవేర్చారు. ఈ ఘటన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులకు ఉన్న అంకితభావాన్ని, వాగ్ధానాన్ని నిలబెట్టుకునే గొప్పతనాన్ని తెలయజేస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇచ్చిన మాట ప్రకారం..

నిడమర్రు మండలం పెదనిండ్రకొలను జవహర్‌లాల్‌ నెహ్రూ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న షేక్‌ మౌలాలి తన విద్యార్థులకు విమాన యానం బహుమతి ఇచ్చారు. అన్న మాట ప్రకారం తెలుగు భాషలో నూటికి నూరు మార్కులు సాధించి, ప్రస్తుతం ఇంటర్‌ చదువుతున్న నిమ్మల పావని, నిమ్మల సత్యసాహితీలను గన్నవరం నుంచి విమానంలో విహార యాత్ర తరహాలో హైదరాబాద్‌ తీసుకువెళ్లి మూడు రోజుల పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వారు తిలకించేలా కృషి చేయడంతో విద్యార్థుల్లో ఆనందోత్సాహాలకు అవధుల్లేవని వారు చెబుతున్నారు.

గత మూడేళ్లుగా తెలుగులో టార్గెట్‌

గతంలో ద్వారకాతిరుమల మండలం ఐఎస్‌ రాఘవరం యూపీ స్కూల్లో ఎస్జీటీగా ఉన్న కాలంలో తోటి టీచర్ల ప్రోత్సాహంతో డిజిటల్‌ తరగతి గదులు, ఇతర పాఠశాల అభివృద్ధి పనులకు దాతల నుంచి రూ.4.5 లక్షలు సమకూర్చినట్లు మౌలాలీ తెలిపారు. పాఠశాలల్లో జరిగే వార్షికోత్సవాల్లో తన వంతుగా ప్రతిభగల విద్యార్థులను సత్కరించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. అక్కడ నుంచి 2019 నవంబర్‌లో తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతిపై పెదనిండ్రకొలను జెడ్పీస్కూల్‌ల్లో బాధ్యతలు స్వీకరించానని, గత మూడేళ్లుగా పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల్లో తెలుగులో ఎక్కువ మార్కులు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించినట్లు తెలిపారు. 2023లో తెలుగులో 98, 2024లో 99 మార్కుల లక్ష్యాలను ఇవ్వగా.. సాధించిన విద్యార్థులకు ఇంటర్‌లో కళాశాలలకు తీసుకువెళ్లాలా స్కై బ్యాగ్స్‌లను బహుమతులుగా అందించినట్లు ఆయన చెప్పారు. 2025లో తెలుగులో నూరు మార్కులు సాధించిన ప్రతి విద్యార్థిని వియాన ప్రయాణం చేయిస్తానని ఇచ్చిన ప్రోత్సాహక హామీని నెరవేర్చినట్లు వివరించారు.

మా ఇద్దరికి తొలిసారి హైదరాబాద్‌ వెళ్లడం, అది విమానంలో వెళ్లడం మంచి అనుభూతిని ఇచ్చింది. తెలుగులో 100 మార్కులు సాధించిన మేము ఇద్దరం బాలికలు అవ్వడంతో మా తెలుగు టీచర్‌ మౌలాలీ, మా గ్రామంలో ప్రైమరీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్న మాస్టారిగారి సతీమణి మహమ్మద్‌ గుల్షీన్‌ బేగంను మాకు తోడుగా తీసుకువచ్చారు. మూడు రోజులపాటు హైదరాబాద్‌లోని చార్మినార్‌, హైటెక్‌ సిటీ, సాలార్జంగ్‌ మ్యూజియం వంటి పర్యాటక ప్రదేశాలు సందర్శించడం ఆనందంగా ఉంది. వెళ్లేటప్పుడు గన్నవరం నుంచి విమానంలో, తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్‌లో ప్రయాణం సాగింది, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులను ఇలా ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువుల్లో రాణిస్తామని మా టీచర్లకు హామీ ఇస్తున్నాం.

– నిమ్మల సత్యసాహితీ, నిమ్మల పావని

తెలుగులో 100 మార్కులొస్తే.. విమాన ప్రయాణం హామీ

ఫలించిన పెదనిండ్రకొలను తెలుగు గురువు వినూత్న ఆలోచన

మాటనిలబెట్టుకుని విద్యార్థులను విమానం ఎక్కించిన మౌలాలి

విమాన యానం.. తెలుగుకు ప్రోత్సాహం 1
1/1

విమాన యానం.. తెలుగుకు ప్రోత్సాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement