ఆక్వాకు ఆక్సిజన్ సమస్య
గణపవరం: పూటకోరకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గుదిబండలా తయారైంది. ముఖ్యంగా ఈ వాతావరణం రొయ్యల సాగుకు పూర్తి ప్రతికూలంగా ఉండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల దారుణంగా దెబ్బతిన్న రొయ్య సాగు కొద్దిగా కుదుటపడుతున్న సమయంలో వాతావరణ మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో గత పదిరోజులుగా నిలకడలేని వాతావరణం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
తుపాను ప్రభావంతో ఆక్వా కుదేలు
వేసవి సాగు మొత్తం తుడిచిపెట్టుకు పోవడంతో గత సెప్టెంబర్ నెలలో ఎక్కువమంది రైతులు చెర్వులలో రొయ్య సీడ్ వేశారు. ప్రస్తుతం రొయ్య కౌంట్ 200 నుంచి 300 మధ్యలో ఉంది. ఈ పరిస్థితుల్లో తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఆక్వా సాగును కుదేలు చేస్తున్నాయి. రొయ్యల చెర్వులలో ఆక్సిజన్ సమస్యతో పాటు వ్యాధుల ముప్పుతో రైతులు సతమతమవుతున్నారు. దీనితో రొయ్యల చెరువులలో నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ ఆక్సిజన్ లోటు భర్తీచేయడానికి శ్రమిస్తున్నారు. ఈ సమస్యలకు తోడు విద్యుత్ కోతలు ఆక్వా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. విద్యుత్ కోతల కారణంగా ఏరియేటర్లు తిరగడానికి ఆయిల్ ఇంజన్లు సైతం సిద్ధం చేసుకుంటున్నారు. నిరంతరం వర్షం జల్లులు పడుతూ వాతావరణం పూర్తిగా చల్లబడి పోవడంతో రెండు రోజులుగా రొయ్యల చెర్వులలో డీవో సమస్య ఏర్పడి రొయ్యలు సరిపడా ఆక్సిజన్ అందక అసహనంతో నీటి ఉపరితలం మీద తేలియాడుతున్నాయి. ఈసమస్య మరీ తీవ్రమైతే అప్పటికప్పుడు రొయ్యలు చనిపోతున్నాయి. దీనితో రైతులు ఆఘమేఘాలమీద రొయ్యలు పట్టుబడిచేసి అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్నారు.
ఆక్సిజన్ సమస్య అధిగమించేందుకు..
రైతులు నిరంతరం చెర్వులలో ఏరియేటర్లు తిప్పుతూ, చెర్వులలో ఇంజన్లువేసి నీటిని రీసైక్లింగ్ చేస్తూ, నిరంతరం నీటిలో కదలిక తేవడం ద్వారా ఆక్సిజన్ సమస్యను కొంతమేర అధిగమిస్తున్నారు. ఆక్సిజన్ లోటు పూడ్చడానికి రసాయనాలు చల్లుతున్నారు. ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినలేక నీరసించి పోవడంతో రైతులు యుద్ధ ప్రాతిపదికన పట్టివేసి అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా 50 శాతం చెర్వులలో అంటే 1.25 లక్షల ఎకరాల్లో రొయ్య సాగు జరుగుతుంది. ఉంగుటూరు నియోజకవర్గంలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో జూన్ నెలలో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో రొయ్యలు అర్ధాంతరంగా పట్టివేసినట్లు అంచనా.
ప్రతికూల వాతావరణం తట్టుకోవాలంటే..
రొయ్యసీడ్ నాణ్యత కలిగి ఉండాలి. నీటి పీహెచ్‌స్థాయి సరైన మోతాదులో ఉండాలి. నిరంతరం ఆక్సిజన్ స్థాయిని సరిచూసుకుంటూ ఉండాలి. నీటి క్షారస్వభావం, నీటి కాఠిన్యం సరైన స్థాయిలో ఉండేలా చూడాలి. చెర్వులో ప్రమాదకరమైన విషవాయువులు అమ్మోనియా నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటివి తయారవకుండా చర్యలు తీసుకోవాలి. చెర్వుల్లో రొయ్యపిల్ల సాంద్రతను బట్టి పాక్షిక పట్టుబడి చేసుకుంటే మిగిలిన రొయ్యలు ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా పెరగడానికి అవకాశం ఉంటుంది.
మత్స్యశాఖ అధికారుల సూచనలు
చెర్వులలో ఉష్ణోగ్రతలు తగ్గకుండా నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ నీటిని రీసైక్లింగ్ చేయాలి. ఆక్సిజన్ లోపనివారణకు పొటాషియం పర్మాంగనేటు, ఆక్సిజన్ టాబ్లెట్స్ సిద్ధంగా ఉంచుకుని, అవసరం మేరకు చెర్వులో చల్లుతుండాలి. ఆక్సిజన్ సరిపడా అందకపోవడంతో చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినని కారణంగా పరిమితంగా మేతలు వేస్తుండాలి. ఆక్సిజన్ సమస్య ఉన్న సమయంలో చెర్వులలో మేత, సేంద్రియ ఎరువులను వేయడం పూర్తిగా మానివేయాలి. చెర్వులలో మినరల్స్ ఎక్కువగా వినియోగించకూడదు. నీటి పరీక్షలు చేయించి చెర్వులో అమ్మోనియా స్థాయిని నిర్ధారించుకోవాలి.
ఎడతెరిపిలేని వర్షాలతో అనర్థం
ఆక్వాకు ఆక్సిజన్ సమస్య


