మహిళా దొంగ అరెస్ట్
భీమడోలు: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల బ్యాగులను దొంగిస్తున్న ఓ మహిళా దొంగను గురువారం భీమడోలు సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామానికి చెందిన మహిళా దొంగ వేములపల్లి దుర్గ నుంచి 33.5 గ్రాముల బంగారు అభరణాలు, 117 గ్రాముల వెండి అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భీమడోలు సర్కిల్ కార్యాలయంలో గురువారం ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌తో కలిసి సీఐ యూజే విల్సన్ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గత నెల 28వ తేదీ సాయంత్రం విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన గొడుగు సత్యవాణి తన 8 ఏళ్ల కుమారుడితో కలిసి ద్వారకాతిరుమల మండలం రాళ్లకుంట తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా ద్వారకాతిరుమల బస్టాండ్‌లో బస్సు ఎక్కే క్రమంలో బంగారు అభరణాలు, వెండి ఆభరణాల గల బ్యాగ్ ఆపహారణకు గురైంది. దీనితో సత్యవాణి ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఆదేశాల మేరకు భీమడోలు సీఐ యూజే విల్సన్ పర్యవేక్షణలో ఎస్సై టి.సుధీర్ తన సిబ్బందితో కలిసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ద్వారకాతిరుమల ఆర్టీసీ బస్టాండ్‌లో మహిళా దొంగ వేములపల్లి దుర్గను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వేములపల్లి దుర్గ, ఆమె భర్త శివకుమార్ బస్టాండ్లలో ప్రయాణికుల బ్యాగుల లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారిలో వేములపల్లి దుర్గను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి చిన్నపిల్లల బ్రేస్లేట్, చైన్, గ్రీన్ రాయి, మ్యాటీలు, చిన్నపిల్లల ఉంగరాలు, చెవి బుట్టలు, చిన్న, పెద్ద చెవి దిద్దులు, జూకాలును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా వెండి జాలర్ల పట్టిలు, వెండి చైన్, చిన్న పిల్లల వెండి బ్రాస్లెట్, వెండి తాళం గుత్తి, వెండి రాఖీలను రికవరీ చేశారు. రెండు బంగారు గాజులను మహిళా దొంగ అట్టికా గోల్డ్‌లో పెట్టిందని, వాటిని రికవరీ చేయాల్సి ఉందన్నారు. ఆమెను భీమడోలు కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ కేసుల ఛేదనకు కృషి చేసిన బృందం సభ్యులు జి.దుర్గారావు, సీహెచ్ లక్ష్మీనారాయణ, ఎం.రాఘవ, టి.లక్ష్మీనారాయణ, వీజే ప్రకాష్‌బాబులను సీఐ అభినందించారు.


