డైట్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని దూబచర్ల డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను 2025–26 విద్యా సంవత్సరానికి భర్తీ చేయడానికి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యజమాన్యాల్లో (ప్రభుత్వ/జిల్లా పరిషత్, మున్సిపల్) పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఉత్తీర్ణత సాధించిన వారిని ఆయా పోస్టుల్లో నియమిస్తారని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 29వ తేదీ వరకూ సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా / మండల విద్యాశాఖాధికారి వారి ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. నవంబర్ 5 నుంచి 8వ తేదీ వరకూ రాత పరీక్షలు నిర్వహిస్తారని, అదే నెల 13వ తేదీన పరీక్షల ఫలితాలు వెల్లడించి అర్హులైన వారికి నవంబర్ 14, 15 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఎంపికై న వారికి నవంబర్ 18వ తేదీన డిప్యూటేషన్ ఉత్తర్వులు జారీ చేస్తారని, 19వ తేదీన సదరు పోస్టుల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నారు. డైట్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు డిసిప్లినరీ కేసు, క్రిమినల్ కేసు గాని ఉంటే దరఖాస్తు చేయరాదని, ప్రస్తుతం డైట్‌లో పనిచేస్తున్న వారు కూడా దరఖాస్తు చేయరాదన్నారు. దరఖాస్తు చేసుకునే వారు అర్హత ప్రకారం ఒక పోస్టుకు మాత్రమే ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించాలని, స్కూల్ అసిస్టెంటుగా పని చేస్తున్న వారు 2015 అక్టోబర్ 31 తేదీ నాటికి ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలని, 58 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం మాస్టర్ డిగ్రీలో 55 శాతం, ఎంఈడీలో 55 శాతం మార్కులు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
పెదవేగి: గత రెండు రోజులుగా ఉత్కంఠభరితంగా జరిగిన అండర్ 19 అంతర్ జిల్లాల అథ్లెటిక్ చాంపియన్‌లో శ్రీకాకుళం బాల, బాలికల జట్టులు సత్తా చాటి చాంపియన్స్‌గా నిలిచారు. పెదవేగి మండలం ఎంఆర్‌సీ కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఈనెల 22, 23 తేదీల్లో అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బాల బాలికలు అన్ని రకాల విభాగాల్లో సత్తాచాటారు. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌గా శ్రీకాకుళం బాల, బాలికలు నిలిచారని ఎస్‌జీఎఫ్ అండర్ 19 కార్యదర్శి కె జయరాజు తెలిపారు. విజేతలను బహుమతులు, మెడల్స్, ప్రశంసా పత్రాలతో సత్కరించి, అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ శివప్రసాద్, పలువురు పీడీలు, తదితరులు పాల్గొన్నారు.


