ఎక్స్‌ఆర్‌డీ ల్యాబ్ ప్రారంభించిన నిట్ డైరెక్టర్
తాడేపల్లిగూడెం: స్ఫటికాకార పదార్థా పరమాణు, పరమాణు నిర్మాణాన్ని విశ్లేషించడానికి ఎక్స్‌రే డీప్రాక్షన్ పరికరాలను ఉపయోగిస్తారని ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్‌వీ రమణరావు అన్నారు. ఏపీ నిట్‌లో బృందావనం భవనంలో రూ.కోటి 65 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎక్స్‌ఆర్‌డీ ల్యాబ్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మెటీరియల్ క్యారెక్టరైజేషన్, నాణ్యత నియంత్రణ కోసం మెటీరియల్ సైన్సు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఉపయోగిస్తారన్నారు. విద్యార్థులు నాణ్యమైన పరిశోధనలు చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో ఉన్న నూతన ల్యాబ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ల్యాబ్ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. డీన్ రీసెర్చ్ కిరణ్‌శాస్త్రి, ఆచార్యులు కృష్ణమూర్తి పి.తపస్ పర్మానిక్, రిజిస్ట్రార్ దినేష్, డీన్లు సందీప్, హిమబిందు, వీరేశ్‌కుమార్ పాల్గొన్నారు.
ఏలూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం అందించే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులతో పాటు రాష్ట్రీయ ప్రోత్సాహన్ పురస్కార అవార్డులకు అర్హత కల్గిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్‌ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ రాత్రి గం.11.59 లోపు డబ్ల్యూడబ్ల్యూబడబ్ల్యూ.డీబీఏటీవైఏఎస్–ఎస్‌పీఓఆర్‌టీఎస్.జీఓవీ.ఏఎన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
భీమడోలు: జాతీయ రహదారి కురెళ్లగూడెం, భీమడోలు గ్రామాల మధ్య రోడ్డు పక్కనే గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, నీలం, తెలుపు రంగు గల షర్టు, సిమెంట్ కలర్ ఫ్యాంటును ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కురెళ్లగూడెం వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు భీమడోలు ఎస్సై షేక్ మదీనా బాషా తెలిపారు.


