
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
తణుకు అర్బన్: ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తణుకు మండలం తేతలిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గరగ సాయితేజ (19) పైడిపర్రుకు చెందిన యువతిని 6 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల వీరి ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడిన అనంతరం సాయితేజ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సాయితేజ నాలుగో ఏటనే తండ్రి మృతి చెందగా తల్లికి ఒక్కగానొక్క కొడుకు కావడంతో గారాబంగా పెరిగాడు. సాయితేజ కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సాయితేజ మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. బంధువుల ఫిర్యాదు మేరకు తణుకు రూరల్ ఎస్‌సై కె.చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.