
విద్యార్థి ఉసురు తీసిన బెట్టింగ్ వ్యసనం
మైలవరం: బెట్టింగ్‌లతో అప్పులపాలై ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైలవరంలో బుధవారం జరిగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవరపల్లికి చెందిన గొర్రె అరవింద్ (23) మైలవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అతను స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు. కొంత కాలంగా ఆన్‌లైన్‌లో బెట్టింగులకు అలవాటు పడ్డాడు. చేసిన అప్పులు చెల్లించలేక బుధవారం కాలేజీకి వెళ్లకుండా హాస్టల్ రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.