
ఎల్లో గ్యాంగ్ చేతుల్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్!
తప్పు నిర్ధారణ చేసినా చర్యలేవి?
సాక్షి టాస్క్‌ఫోర్స్: క్రయ, విక్రయదారులకు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు అక్రమార్కులకు వరంగా మారుతోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అపహాస్యమవుతోంది. ఇతర జిల్లాల నుంచి వచ్చి పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. బ్యాంకుల్లో పత్రాలు పెట్టి రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లా రిజిస్ట్రార్ విచారణ నివేదిక ఆధారంగా అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం జిల్లా కలెక్టర్లు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసినా వాస్తవరూపం దాల్చలేదు. దీంతో కూటమి నేతలు అక్రమార్కులతో చేయి కలుపుతున్నారు. స్థానిక బలంతో అధికారుల విధులకు అడ్డు తగులుతున్నారు.
గణపవరానికి చెందిన కురెళ్ళ రాజ్‌కుమార్‌కు కలిదిండి మండలం, పటమటిపాలెం బర్రింకలగరువులో సర్వే నంబరు 728/9లో 9 సెంట్ల భూమి ఉంది. ఇదే గ్రామానికి చెందిన కూటమి నేత ఇదే సర్వే నంబరుతో 10.13 సెంట్లకు ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించాడు. విషయం తెలుసుకున్న రాజ్‌కుమార్ పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేశాడు. ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బ్యానర్‌తో నిరసన తెలిపాడు. ఇదిలా ఉంటే పీజీఆర్‌ఎస్‌లో సమస్య పరిష్కారం అయ్యిందని ఉండి ఎస్సై ఎండార్స్‌మెంటు ఇచ్చినట్లు రాజ్‌కుమార్‌కు మెసేజ్ వచ్చింది. తప్పుడు ఫొటోను సైతం అప్‌లోడ్ చేశారు. ఎస్సై నా ప్రమేయం లేదని చెప్పడంతో తిరిగి విచారణ చేశారు. ఎట్టకేలకు కూటమి నాయకుడిది తప్పుడు రిజిస్ట్రేషన్ అని అధికారులు విచారణలో తేల్చారు.
కూటమి నేతల కుట్రలతో అధికారికి చిక్కులు
కలిదిండిలో మరొకరి స్థలాన్ని తనదే అంటున్న కూటమి నేతకు రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల పదవీ విరమణ చేసిన జిల్లా స్థాయి అధికారి స్నేహితుడు. దీంతో ఉండి రిజిస్ట్రార్‌కు తన స్నేహితుడికి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని సిఫార్సు చేశాడు. దీంతో ఆమె ఎటువంటి పత్రాలను పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేసింది. బాధితుడు రాజ్‌కుమార్ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉండి సబ్ రిజిస్ట్రార్ తప్పుడు రిజిస్ట్రేషన్ వెలుగుచూసింది. సదరు అధికారిణి నాలుగు నెలలుగా రావడం లేదు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ నుంచి మెమోను సైతం అందించారు. సిఫార్సు చేసిన అధికారి వద్దకు తనను సమస్య నుంచి బయటపడేయాలని అధికారిణి తిరుగుతున్నారు.
తప్పుడు రిజిస్ట్రేషన్లకు అడ్డాగా ఉండి, ఆకివీడు
అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి, అకివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మారుతున్నాయి. ఏలూరు జిల్లా కై కలూరు, మండవల్లి మండలాలు, కృష్ణాజిల్లా బంటుమిల్లి, పెడన, మచిలీపట్నం, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ఇక్కడ జరుగుతున్నాయి. రాజ్‌కుమార్ వంటి అనేక మంది బాధితులు తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వంలో మరీ అక్రమార్కులు రెచ్చిపోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు రిజిస్ట్రేషన్లు
కలిదిండికి చెందిన భూమికి మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్
కాళ్లరిగేలా తిరుగుతున్న బాధితుడు
ఆక్రమణదారుడికి కూటమి నాయకుల అండ
నా భూమిని ఆక్రమించుకోవడానికి ఉండిలో తప్పుడు రిజిస్ట్రేషన్‌కు కలిదిండికి చెందిన కూటమి నేత పాల్పడ్డాడు. అతని తప్పుని నేను ఎండగట్టాను. ఒకరి భూమిని ఆక్రమించుకుంటున్న వ్యక్తికే కూటమి నేతలు మద్దతు తెలుపుతున్నారు. ఉండిలో అక్రమ సవరణ దస్తావేజు 1531/2025ను రద్దు చేసి, మోసం చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నా భూమిని అధికారులు అప్పగించాలి. – కురేళ్ళ రాజ్‌కుమార్, బాధితుడు, గణపవరం

ఎల్లో గ్యాంగ్ చేతుల్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్!

ఎల్లో గ్యాంగ్ చేతుల్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్!