
ఇది మీకు తెలుసా..
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఏదైనా అసౌకర్యం కలిగితే దానికి కారణమైన దేవస్థానం సిబ్బందిపై ఫిర్యాదు చేయవచ్చు. అలాగే అధికారులకు ఏవైనా సలహాలు, సూచనలు కూడ ఇవ్వొచ్చు. దశాబ్దాల కాలం నుంచి అందుబాటులో ఉన్న ఈ ఫిర్యాదుల పుస్తకాల గురించి చాలా మంది భక్తులకు తెలియదు. వివరాల్లోకి వెళితే. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తున్నారు. వారి సౌకర్యార్థం అధికారులు ఎప్పటికప్పుడు అనేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈ సలహాలు, సూచనల పుస్తకాలు, బాక్సులను ఆలయ కార్యాలయం, కేశఖండనశాల, వకుళమాత నిత్యాన్నదాన భవనం, సీఆర్వో కార్యాలయం, సత్రాలు తదితర విభాగాల వద్ద భక్తులకు అందుబాటులో ఉంచారు. వాట్సాప్, మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేసేవారి కోసం సలహాలు, సూచనల బాక్సులపైన, ఇతర ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు. అయితే టీటీడీ సదనం, ప్రసాదాల మెయిన్ కౌంటర్‌లో ఈ పుస్తకాలు లేవు. దాంతో టీటీడీ సదనంలో ఇటీవల ఓ భక్తురాలికి కలిగిన అసౌకర్యంపై ఆమె స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న సమాచార కేంద్రానికి వెళ్లి, అక్కడ ఫిర్యాదుల పుస్తకంలో తన ఫిర్యాదు రాయాల్సి వచ్చింది.
ఎవరిపై ఫిర్యాదు చేయొచ్చంటే..
భక్తుల పట్ల అమర్యాదగా నడుచుకునే.. దురుసుగా ప్రవర్తించే.. మరేరకంగానైనా అవమానపరిచే వారిపై.. అలాగే శ్రీవారి సేవలకు అదనపు రుసుములు వసూలు చేసే సిబ్బందిపై ఫిర్యాదు చేయవచ్చు. అలాగే అధికారులకు అన్ని రకాల సూచనలు, సలహాలను ఇవ్వొచ్చు.
ఫిర్యాదు చేసేదిలా..
ఫిర్యాదు చేయదలచిన, లేదా సూచనలు, సలహాలు ఇవ్వదలచిన భక్తులు సంబంధిత కార్యాలయాల్లోకి వెళ్లి అక్కడి ఉద్యోగులను ఫిర్యాదుల పుస్తకం అడిగి, అందులో రాయొచ్చు. లేదా ఆయా కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన సలహాలు, సూచనల బాక్సుల్లో ఫిర్యాదు పత్రాలను వేయొచ్చు. డిజిటల్ విధానం ద్వారా ఫిర్యాదులు చేసే వారు ఆ బాక్సులపై ఉండే క్యూఆర్ కోడ్‌ను సెల్‌ఫోన్‌లోని గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి ఆలయ ఈఓ వాట్సాప్‌కు, లేదా మెయిల్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాది దారుడి చిరునామా, సెల్ నెంబర్ లను తప్పనిసరిగా అందులో చూపాలి.
ఫీడ్‌బ్యాక్ సెక్షన్ పర్యవేక్షణలో..
సలహాలు, సూచనల బాక్స్‌లు, పుస్తకాలు డీఈఓతో పాటు, సంబంధిత విభాగాల గుమస్తాలతో కూడిన ఫీడ్‌బ్యాక్ సెక్షన్ పర్యవేక్షణలో ఉంటాయి. భక్తుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదు, సలహా, సూచనను వారు ఈఓకు చేరవేస్తారు.
పరిష్కారం ఇలా..
ప్రతి పది, పదిహేను రోజులకు ఒకసారి ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి ఈ ఫిర్యాదులు, సలహాలు, సూచనలను పరిశీలించి, సంబంధిత సెక్షన్ అధికారుల నుంచి వివరణ తీసుకుంటారు. ఆ తరువాత తగు చర్యలు చేపడతారు. వాటి వివరాలను నెలకోసారి ఆలయ ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు ముందు ఉంచుతారు. ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే ఈఓకు ఆయన సూచిస్తారు. అధికారులు తగు సమాచారాన్ని ఫిర్యాదికి తెలియజేస్తారు. ఇలా ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం లభిస్తుంది.
శ్రీవారి ఆలయంలో అసౌకర్యాలపై ఫిర్యాదు చేయొచ్చు
అందుబాటులో సలహాలు, సూచనల బాక్సులు, పుస్తకాలు
ప్రతి ఫిర్యాదుకు ఖచ్చితంగా లభిస్తున్న పరిష్కారం

ఇది మీకు తెలుసా..

ఇది మీకు తెలుసా..