అన్ని రంగాల్లో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర
భీమవరం: రానున్న రోజుల్లో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో టెక్నాలజీ ప్రముఖ పాత్ర వహిస్తుందని జాయింట్ కలెక్టర్ టి రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఇన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన సైన్స్ మేళా ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన ఇన్నోవేటివ్ స్టాల్స్‌ను పరిశీలించారు. వాటిలో ప్రమాద సమయాల్లో, వ్యవసాయ రంగానికి, అడవుల రక్షణకు ఉపయోగపడే విధంగా విద్యార్థులు తయారుచేసిన పలు రకాల డ్రోన్స్‌ను జాయింట్ కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. సెట్‌వెల్ సీఈవో కేఎస్ ప్రభాకరరావు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్‌ఆర్‌కే నిశాంత్‌వర్మ, కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, కోఆర్డినేటర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ దిలీప్ చక్రవర్తి పాల్గొన్నారు.
మొదటి బహుమతి ఎస్‌ఆర్‌కేఆర్‌కే
జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్లో దాదాపు 135 ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు ప్రదర్శించగా మొదటి బహుమతి భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ద్వితీయ బహుమతి నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు దక్కింది. అలాగే తృతీయ బహుమతి తణుకు ఎస్‌కేఎస్‌డి ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు రూపొందించిన ప్రాజెక్టుకు బహుమతి దక్కింది. వీరు అమరావతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.


