అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఆకివీడు: మండలంలోని గుమ్ములూరు గ్రామానికి చెందిన కొదమ మార్కురాజు(34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో బుధవారం మృతుడి బంధువులు స్థానిక పొలీస్ స్టేషన్ వద్ద మృతదేహంతో ధర్నా చేశారు. గత నెల 24వ తేదీన మార్కు రాజు కన్పించకుండా పోయిన విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కన్పించకుండా పోయిన మార్కురాజు బుధవారం చేపల మార్కెట్ రోడ్డు వద్ద ఫిష్ ప్యాకింగ్ ప్రాంతంలో పురుగుల మందు తాగి తన సోదరుడికి తెలియజేయాలని అక్కడున్నవారికి చెప్పడంతో అతని సోదరుడు అహరోన్ వచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం భీమవరం, విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద మార్కురాజు మృతదేహంతో ధర్నాచేశారు. అహరోన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.


