బాలుడి అదృశ్యం కేసు సుఖాంతం
తణుకు అర్బన్: తణుకులో పాఠశాలకు బయలుదేరి అదృశ్యమైన బాలుడి వ్యవహారం సుఖాంతమైంది. సజ్జాపురానికి చెందిన బాలుడు అన్నెపు రూప భానుప్రసాద్ (13) కనిపించడంలేదని పట్టణ పోలీస్ స్టేషన్‌లో తాతయ్య కూన నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 21వ తేదీ రాత్రి తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో భాగంగా పూళ్లలోని నానమ్మ ఇంట్లో బాలుడు ఉన్నాడని తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. భానుప్రసాద్ తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 21న పాఠశాలకు వెళ్లకుండా పూళ్లలో నివసిస్తున్న నానమ్మ, తాతయ్యల వద్దకు సైకిల్‌పై వెళ్లాడు. మధ్యాహ్నం పాఠశాలకు క్యారేజీ తీసుకువెళ్లిన తాతయ్య నరసింహారావుకు భానుప్రసాద్ పాఠశాలకు వెళ్లలేదనే విషయం తెలిసింది. ఆరోజు సాయంత్రం ఆయన పోలీసులను ఆశ్రయించారు. చైన్నెలో ఉంటున్న తల్లిదండ్రులు బుధవారం తణుకు వచ్చి పిల్లాడి వెతుకులాటలో పడ్డారు. అయితే నానమ్మ ఇంట్లో ఫోన్ సౌకర్యం లేకపోవడంతో తల్లిదండ్రులు పక్కింటి వారికి ఫోన్‌చేయడంతో అక్కడే ఉన్నట్లుగా తెలిసింది.


