పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం పూజలు ప్రారంభమయ్యాయి. బుధవారం వేకువజామున 4 గంటలకు ఆలయం తెరవడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాకారంలో కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక మాసంలో ప్రదోష కాలం సమయంలో ఆలయంలో వెలిగించే ఆకాశ దీపాలను మంగళవారం రాత్రి నుండి పాఢ్యమి రావడంతో దీపాలను వెలిగించారు. నెలవారీ పూజలు చేయించుకునే భక్తులు మహన్యాసపూర్వక అభిషేకాలు చేయించుకున్నారు. అయ్యప్ప భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటుచేశారు. క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు.
ఉమాసోమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
భీమవరం(ప్రకాశం చౌక్): పంచారామక్షేత్రం గునుపూడి ఉమాసోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో బుధవారం కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునుంచే ఉమాసోమేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించారు. స్వామికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేశారు.
కార్తీక మాస పూజలు ప్రారంభం


