
2003 డీఎస్సీ ఉపాధ్యాయుల నిరసన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2003–డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని 2003 డీఎస్సీ ఫోరమ్ నాయకులు డిమాండ్ చేశారు. ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం స్థానిక ఏలూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఫోరమ్ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎస్ విధానం అమలు 2004 సెప్టెంబన్ 1కు ముందు నోటిఫికేషన్ వెలువడినప్పటికీ, నియామకాలు తర్వాత జరిగిన కారణంగా సుమారు 11,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాత పెన్షన్ నష్టపోయారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం వీరందరికీ పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఏలూరు తహసీల్దార్ గాయత్రికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఇప్పిలి శంకర్ రావు, నండూరి గణేష్, మరక బాలసుబ్రహ్మణ్యం, ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.