
ఆధిపత్యం కోసమే హత్య
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ కొమడవోలు ఇందిరమ్మ కాలనీలో ఇటీవల జరిగిన దారుణ హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎప్పీ డి.శ్రావణ్‌కుమార్ బుధవారం ఏలూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కొమడవోలు ఇందిరమ్మ కాలనీకి చెందిన పూనూరు రాజేష్ కొందరు రాజకీయ నేతల అండతో గొడవలకు సెటిల్‌మెంట్లు చేస్తూ ఉంటాడు. ఇదే ప్రాంతానికి చెందిన బూరగ నాని అలియాస్ చిన్న నాని మృతుడితో సన్నిహితంగా మెలిగేవాడు. కానీ కొన్ని సందర్భాల్లో రాజేష్ కఠినంగా ప్రవర్తిస్తూ చిన్న నానిని మందలించటం... కొట్టటం చేసేవాడు. రాజేష్‌కు తెలిసిన ఒక మహిళతో నాని చనువుగా ఉండటాన్ని గమనించిన ఆమె బంధువులు గతంలో నానితో గొడవపడి కొట్టారు. దీనిలోనూ రాజేష్ కీలకపాత్ర పోషించాడని నాని మనసులో కక్ష పెంచుకున్నాడు. పైగా ఇందిరమ్మ కాలనీలో సెటిల్‌మెంట్లు చేస్తున్న రాజేష్ లేకుంటే... తానే పెద్దమనిషిగా చలామణి అవ్వచ్చు అనే ఆలోచనతో రాజేష్‌ను చంపేందుకు తన స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్ వేశాడు.
కత్తులతో దాడి చేసి..
ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆగస్టు 31 తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇందిరమ్మ కాలనీలో రాజేష్ తన ఇంట్లో ఉండగా బూరగ నాని అతని ఇంటికి వెళ్లి బయటకు రావాలని పిలిచాడు. చర్చి సమీపంలోకి తీసుకువెళ్లి నాని, మరో ఐదుగురు కత్తులతో దాడి చేసి కారులో పరారయ్యారు. ఈలోగా అరుపులు, కేకలకు రాజేష్ కుమార్తె, కుమారుడు, చెల్లి బయటకు వచ్చి చూడగా తీవ్ర గాయాలతో ఉన్నాడు. కుటుంబ సభ్యులు అతడ్ని ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్థారించారు. మృతుడి భార్య ఫిర్యాదుపై ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసును ఛేదించిన పోలీసులు
ఈ కేసు విచారణకు సంబంధించి ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో ఏలూరు వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈనెల 10న ఏలూరు జాతీయ రహదారిపై రత్నాస్ రెస్టారెంట్ వెనుక నిందితులు ఉన్నారనే సమాచారంతో ఏలూరు వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, రూరల్ ఇన్‌చార్జి ఎస్సై నాగబాబు, సిబ్బంది కలిసి ఆరుగురు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి స్కూటీ, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు వీరే..
ఏలూరు రూరల్ ఇందిరమ్మ కాలనీకి చెందిన ప్రధాన నిందితుడు బూరగనాని అలియాస్ చిన్ననానితోపాటు, ఏలూరులోని వివిధ ప్రాంతాలకు చెందిన సామంతుల అజయ్‌సూర్య అలియాస్ బెస్సీ, లంకపల్లి బాలకృష్ణ అలియాస్ బాలు, సిగిరెడ్డి సుధాకర్ అలియాస్ సుధా, ఉగ్గిన షణ్ముక వేణుగోపాల్ అలియాస్ వేణు, కటారి పూర్ణచంద్ర శేఖర్ అనే ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురిపై ఏలూరు నగరంలో పాత కేసులు ఉన్నాయి. ఈ కేసును ఛేదించిన సీఐలు సత్యనారాయణ, అశోక్‌కుమార్, ఎస్సై నాగబాబు, ఏఎస్సై సురేష్, హెచ్‌సీ సత్యారావు, కానిస్టేబుళ్లు బీ.నాగార్జున, ఆర్.మోహన్, పీ.నాగరాజు, ఎండీ రుహుల్లా, ఎన్.శేషుకుమార్‌ను ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.