
కేవీకే హెడ్ సైంటిస్ట్‌కు అవార్డు
ఉండి: ఏరువాక ఉత్తమ శాస్త్రవేత్త అవార్డుకు ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.మల్లిఖార్జునరావు ఎంపికయ్యారు. ఏరువాక ఫౌండేషన్ ఏటా వ్యవసాయ అనుబంధ రంగాల్లోని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే శాస్త్రవేత్తలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తుంది. దీనిలో భాగంగా 2023–24కి గాను ఉత్తమ విస్తరణ నిపుణుడు ఎంటొమోలోజీ విభాగంలో డాక్టర్ మల్లిఖార్జునను ఉత్తమ శాస్త్రవేత్తగా ఎంపిక చేశారు. ఈమేరకు ఫౌండేషన్ నుంచి తనకు సమాచారం అందినట్లు మల్లిఖార్జునరావు తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో గుంటూరు కేఎల్ యూనివర్సీటీలోని కాలేజ్ ఆఫ్ ఆగ్రికల్చర్ ఆర్‌అండ్‌డీ థియేటర్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డు అందజేస్తారని ఆయన చెప్పారు.
టి.నరసాపురం: బొర్రంపాలెం అన్నపూర్ణ ఫెర్టిలైజర్స్ అండ్ జనరల్ స్టోర్స్‌లో బుధవారం విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. షాపులో ఆయా ఎరువులు ఉండాల్సిన దానికన్నా 3.245 టన్నులు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రూ.6,98,663 విలువ కలిగిన యూరియా, పొటాష్, 10–26, సూపర్ 39.585 టన్నులను సీజ్ చేశారు. షాప్ యజమాని అశోక్ కుమార్‌పై 6 ఏ కేసు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్సై రంజిత్ కుమార్, విజిలెన్స్ ఏవో మీరయ్య, మండల వ్యవసాయ అధికారిణి బి.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ఉండి: ఈ నెల 17వ తేదీ నుంచి ఎన్నార్పీ అగ్రహారంలోని కృషీ విజ్ఞాన కేంద్రంలో మిద్దెతోటల పెంపకంపై శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిద్దెతోటల పెంపకంతో పాటు తేనెటీగలు, కోళ్లు, చేపల పెంపకం, బయోడీకంపోజర్స్ వినియోగం తయారీపై సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మిద్దెతోటల పెంపకం నిపుణుడు వేణుగోపాలరావు తదితర జిల్లా మండల అధికారులు హాజరువుతారని తెలిపారు. మిద్దెతోటలు తదితర వాటిపై అవగాహన, శిక్షణలో ఆసక్తి గల మహిళలు హాజరు కావాలని కోరారు.
పెదవేగి : ఎస్‌జీఎఫ్ అండర్ 19 జిల్లా జట్ల ఎంపిక పోటీలు బుధవారం పెదవేగి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఉత్సాహంగా జరిగాయి. ఫెన్సింగ్ జూడో, బాక్సింగ్, బీచ్ వాలీబాల్, రగ్బీ, తైక్వాండో, గక్కా క్రీడాంశాలలో పోటీలు నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు డీవైఈఓ టి శేఖర్‌బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కె జయరాజు తెలిపారు. ఈ పోటీల్లో కళాశాల ప్రిన్సిపాల్ ఏవీ శివప్రసాద్, ఇతర పీడీలు పాల్గొన్నారు.
భీమవరం: భీమవరం ఒకటో పట్టణంలోని శ్రీనివాసా కూడలిలో ఇంట్లో ఉరివేసుకుని సునీల్ (39) అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సునీల్ పట్టణంలోని ఓ దుకాణంలో మోటార్‌సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి ఆత్మహత్య సమాచారం అందడంతో ఎస్సై బీవై కిరణ్‌కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.

కేవీకే హెడ్ సైంటిస్ట్‌కు అవార్డు