
మన్యంలో ప్రకృతి సేద్యం
● 10 వేల ఎకరాల్లో రసాయన రహిత సాగు
● స్వయంగా కషాయాలు తయారు చేస్తున్న గిరిజన రైతులు
బుట్టాయగూడెం: రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగంతో వ్యవసాయం భారంగా మారుతోంది. మిత్ర పురుగుల నాశనంతో చీడపీడల బెడద పెరుగుతుంది. దీనితో అధికారుల ప్రోత్సాహంతో తక్కువ పెట్టుబడి కలిగిన ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. మన్యంలో ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులకు ఐటీడీఏ, ప్రకృతి వ్యవసాయ రైతులు అవగాహన కలిగిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సుమారు 1,596 మందికి పైగా సుమారు 10 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రకృతి సాగులో పంటలు
కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతోపాటు జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో గిరిజనులు సుమారు 10 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, మినుము పంటలతోపాటు జీడిమామిడి, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయల పంటలను ప్రకృతి వ్యవసాయంగా సాగు చేసి పండిస్తున్నారు. వీటిలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల పరిధిలో 4 వేల ఎకరాల్లో జీడిమామిడి, 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 270 ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో మిర్చి, 250 ఎకరాల్లో మినుము, 280 ఎకరాల్లో కూరగాయలు, 3 వేల ఎకరాల్లో చిరుధాన్యాల పంటలు సాగు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
స్వయంగా కషాయాల తయారీ
ప్రకృతి వ్యవసాయ పంటలకు కషాయాలను స్వయంగా గిరిజన రైతులు తయారు చేసుకుంటున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులకు బదులుగా పంటలకు జీవామృతం, ఘనామృతం, బీజామృతం, ద్రవ జీవామృతం, పంచగవ్య, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి రసాయనాలను గిరిజన రైతులు స్వయంగా తయారు చేసుకుని పంటలకు వినియోగించుకుంటున్నారు.