
మొగల్తూరు ముత్యాలమ్మ పూరిపాక దగ్ధం
నరసాపురం రూరల్: మొగల్తూరు గ్రామదేవత నడివీధి ముత్యాలమ్మ అమ్మవారి పూరిపాక సోమవారం అర్ధరాత్రి దగ్థమైంది. ఈ ఘటనతో భక్తులు, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆలయ ధర్మకర్త, కమిటీ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మత సామరస్యానికి ఇబ్బంది కలుగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది. అడిషనల్ ఎస్పీ వాసుపల్లి భీమారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ సమాచారం అందిన వెంటనే డీఎస్పీ శ్రీవేద, సీఐలు, ఎస్సైలు సంఘటనా స్థలంలోనే ఉన్నారన్నారు. ఇప్పటికే డాగ్స్‌స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు వచ్చి సమాచార సేకరణలో నిమగ్నమయ్యారన్నారు. ఆలయ ధర్మకర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమారావు తెలిపారు.