
కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్‌లో భారీ చోరీ
రూ.3 కోట్ల బంగారు ఆభరణాలతో ఆడిటర్ పరార్
చింతలపూడి: చింతలపూడి పట్టణంలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్‌లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో అదే సంస్థలో పనిచేస్తున్న ఆడిటర్ వడ్లమూడి ఉమా మహేష్ పరారయ్యాడు. సంస్థ ఉద్యోగులు, ఖాతాదారులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ ప్రధాన కార్యాలయం నుంచి ఆడిటర్ మహేష్ మంగళవారం ఉదయం 11 గంటలకు స్థానిక కనకదుర్గ ఫైనాన్స్ సంస్థకు చేరుకున్నాడు. మేనేజర్ యాదల ప్రవీణ్ కుమార్, క్యాషియర్ అమృతాల ఆషాలను బయటకు పంపించి 380 పాకెట్లలో ఉన్న గోల్డ్‌తో మహేష్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ క్రాంతికుమార్, ఎస్సై సతీష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సాయంత్రం 5 గంటల సమయంలో తనకు హెల్త్ బాలేదని, కొబ్బరి నీళ్లు తీసుకురమ్మని తమను బయటికి పంపించి మహేష్ గోల్డ్ బ్యాగ్‌తో పరార్ అయినట్లు సంస్థ ఉద్యోగులు తెలిపారు. అతడు బంగారం ఉన్న బ్యాగ్‌తో ఏలూరు వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.