
పాలనలో విఫలం.. సమస్యలతో సావాసం
● నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏడాదిగా ఇన్‌చార్జులే దిక్కు
● విద్యార్థులపై కొరవడిన పర్యవేక్షణ
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏడాది కాలంగా ఇన్‌చార్జి అధికారుల పాలన కొనసాగుతుండటంతో రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతున్నాయి. పాలనలో విఫలం కావడంతో నిరంతరం సమస్యలు చుట్టుముడుతున్నాయి. అకడమిక్ క్యాలెండర్ గాని, బీఓఎస్ సమావేశాలు గాని, ఇతర అకడమిక్ అంశాలపై సుదీర్ఘ అనుభవం కలిగిన నిష్ణాతులతో సంప్రదించకుండానే ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ట్రిపుల్ ఐటీని పురోగమనంలోకి కాకుండా తిరోగమనంలోకి నెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు గడిచినా నేటికి రెగ్యులర్ చాన్సలర్‌ను గాని, వైస్ చాన్సలర్‌ను గాని, నాలుగు ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్‌లను గాని నియమించలేదు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ సండ్ర అమరేంద్రకుమార్‌కు నూజివీడు ట్రిపుల్ ఐటీకి ఇన్‌చార్జి డైరెక్టర్‌గాను, అలాగే ఆర్జీయూకేటీకి ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గాను నియమించింది. ఒకే వ్యక్తికి రెండు కీలకమైన బాధ్యతలు అప్పగించడంతో తలకు మించిన భారంగా మారింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిరంతరం ఎదురయ్యే సమస్యలను పరిష్కరంచడానికే ఉన్న సమయం చాలక సతమతమవుతుంటే రిజిస్ట్రార్‌గా కూడా బాధ్యతలు ఉండటంతో మిగిలిన మూడు ట్రిపుల్ ఐటీలలో ఏ సమస్య ఉత్పన్నమైనా అక్కడికి ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీంతో దేనిపైనా శ్రద్ధ పెట్టలేక పాలన క్రమంగా బలహీనంగా మారి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఏఓ సైతం ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తుండగా ఇటీవలే ఏడాది కాలపరిమితి పూర్తవ్వగా మరలా ఒక నెల ఇన్‌చార్జి బాధ్యతలను పొడిగించారు. ప్రొఫెసర్‌పై ఎంటెక్ విద్యార్థి కత్తులతో దాడికి దిగడం చూస్తుంటేనే ఇక్కడ పాలన ఎలా ఉందో అర్థమవుతోంది.
టెండర్లు పిలవడంలో జాప్యం
సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ ఏజన్సీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో మరలా ఏజెన్సీల ఎంపికకు టెండర్లు పిలవాల్సి ఉన్నా నెలలు గడుస్తున్నా ఇప్పటికీ టెండర్లు పిలవలేదు. ఇది ఎప్పటికీ పిలుస్తారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే శ్రీకాకుళం, ఒంగోలు పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు నూజివీడు క్యాంపస్‌లోనే తరగతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో పరిపాలన లోపం కారణంగానే తెలుగు సబ్జెక్టు బోధనకు సంబంధించి మెంటార్లకు, సర్‌ప్లస్‌లో ఉన్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్య వివాదం తలెత్తి కొద్దిరోజులు పాటు నడిచింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి యాజమాన్యానికి తల బొప్పి కట్టింది. చివరకు మెంటార్లు వెనక్కు తగ్గడంతో ఎలాగోలా సమస్య సద్దుమణిగింది.
క్యాంపస్‌లోకి మందు సీసాలు
విద్యార్థులకు స్వేచ్ఛ ఎక్కువైపోవడంతో క్యాంపస్‌లోకి ఏకంగా మందుసీసాలే వచ్చేస్తున్నాయి. ఇటీవల పార్టీ చేసుకునేందుకు 10 మంది విద్యార్థులు మందు సీసాలను ఒక విద్యార్థితో తెప్పించుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఆ విద్యార్థి గోడ దూకి వెళ్లి మద్యం సీసాలు తీసుకురావడం గమనార్హం. అలాగే క్యాంపస్‌లో బాలురకు, బాలికలకు వేరు వేరుగా ఫుడ్ కోర్టులున్నా బాలికలు కూడా బాలుర ఫుడ్‌కోర్టు వద్దకు వచ్చి బాలురతో దగ్గరగా కలిసి కూర్చొని తింటూ కాలక్షేపం చేస్తున్నారు. దీంతో ఫ్యాకల్టీ, సిబ్బంది ఫుడ్‌కోర్టు వైపు వెళ్లడమే మానివేశారు.
సెమిస్టర్ పరీక్షలు ఎత్తేశారు
దేశ వ్యాప్తంగా హైస్కూల్ స్థాయిలో విద్యార్థులకు ఉన్న వార్షిక పరీక్షలను ఎత్తేసి సెమిస్టర్ పరీక్షల విధానాన్ని తీసుకొస్తుండగా ట్రిపుల్ ఐటీలో మాత్రం పీయూసీ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈ ఏడాది నుంచి సెమిస్టర్ పరీక్షలను ఎత్తేసి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. అధికార బాధ్యతలను చూస్తున్న వారికి అవగాహన లేకో, ఒకరిద్దరూ ఐఏఎస్ అధికారుల మెప్పు పొందడానికో గాని సెమిస్టర్ పరీక్షలను ఎత్తేసి వార్షిక పరీక్షలను ఏర్పాటుచేశారు. దీనికి గవర్నింగ్ కౌన్సిల్ అనుమతి గాని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతులు గాని ఏమీ లేవని ట్రిపుల్ ఐటీలోని అధ్యాపక వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పురోగమిస్తుందో, తిరోగమిస్తుందో అర్థం కావడం లేదని అధ్యాపకులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.