
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
పోలవరం రూరల్: పోలవరం మండలం ప్రగఢపల్లి గ్రామంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. మంగళవారం సొసైటీ గోడౌన్‌కు 270 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకున్న రైతులు యూరియా దొరకదేమోననే ఆందోళనతో ఒక్కసారిగా గోడౌన్ వద్దకు వచ్చి గుమిగూడారు. ఎల్‌ఎన్‌డీపేట, జిళ్లేళ్లగూడెం, వింజరం పంచాయతీ పరిధిలోని సుమారు 18 గ్రామాలకు చెందిన 500 మంది రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. సరిపడా యూరియా లేదని అర్ధమైన రైతులు ఆగ్రహించి రోడ్డెక్కెరు. రైతులందరికీ యూరియా సరఫరా చేయాలని నినదించారు. సమాచారం తెలుసుకున్న పోలీసు వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. మరో లారీ యూరియా మంగళవారం రాత్రికే వచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, బుధవారం అందరికీ అందజేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
తీరని యూరియా కష్టాలు
ఆగిరిపల్లి: రోజులు గడుస్తున్నా రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలు తీరడం లేదు. మంగళవారం ఆగిరిపల్లి సొసైటీలో యూరియా పంపిణీ చేస్తారని సమాచారం రావడంతో ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. 250 బస్తాలు ఉండగా ఒకొక్కరికి ఒక్క బస్తా యూరియా ఇచ్చారు. గంటల కొద్ది నిలబడితే మాకు ఇవ్వకుండా టీడీపీ వారికి ఇవ్వడం ఎంత వరకు సమంజమని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆగిరిపల్లికి యూరియా వస్తుందని వ్యవసాయ అధికారి భవానీ తెలిపారు.

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు