
మొబైల్ విప్లవంతో సాగు సమాచారం
పెనుమంట్ర: మొబైల్ విప్లవం ద్వారా వ్యవసాయ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరువచేయాలనే ఉద్దేశ్యంతో కాబి ఇంటర్నేషనల్ సంస్థ ప్లాంట్‌వైజ్‌ప్లస్ అనే మొబైల్ అప్లికేషన్‌ని తీసుకువచ్చిందని మార్టేరు వరిపరిశోధనా స్థానం సహా పరిశోధనా సంచాలకులు టి.శ్రీనివాస్ తెలిపారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, మార్టేరు, కాబి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్లాంట్‌వైజ్‌ప్లస్ మొబైల్ అప్లికేషన్‌పై మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా.టి.శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, కాబి సంస్థ నుంచి ముఖ్య అతిథిగా హాజరైన అగ్రి–డిజిటల్ కోఆర్డినేటర్ మధు మంజరి మాట్లాడారు. ఈ మొబైల్ సాధనం వ్యవసాయ నిపుణులకు తగిన సమాచారం అందిస్తుందని, తద్వారా వారు రైతులకు మెరుగైన సలహాలను అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. పంటపై పురుగుల నివారణకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటూ సిఫార్సుచేసిన పురుగు మందుల సమాచారం కూడా రైతులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మార్టేరు, నెల్లూరు, బాపట్ల వరి పరిశోధనా స్థానానికి చెందిన శాస్త్రవేత్తలు, విస్తరణ కేంద్రాల శాస్త్రవేత్తలు, వివిధ డివిజన్‌ల వ్యవసాయ సహాయ సంచాలకులు పాల్గొన్నారు.