
సీసలిలో 144 సెక్షన్ అమలు
కాళ్ల: సీసలి గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మంగళవారం నుంచి 15 రోజులపాటు గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆకివీడు సీఐ జగదీశ్వరరావు, తహసీల్దార్ జి.సుందర్ సింగ్ తెలిపారు. సీసలిలో గ్రామదేవత పోలేరమ్మ గుడి పక్కన ఉన్న పోరంబోకు స్థలం విషయమై సోమవారం రాత్రి జరిగిన వివాదంలో పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం కాళ్ల తహసీల్దార్ కార్యాలయంలో ఇరువర్గాల పెద్దలతో పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు శాంతి సమావేశం నిర్వహించారు. సదరు వివాదాస్పద భూమిని ఇరిగేషన్ అధికారులు స్వాధీన పరుచుకోవాలని, ఇరిగేషన్ ఏఈ ఫణిశంకర్‌కు తహసీల్దార్ సూచించారు. గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ఎక్కడా గుంపులుగా గాని, ఐదుగురు కంటే ఎక్కువ వ్యక్తులు గాని ఉండరాదని స్పష్టం చేశారు. బయట నుంచి వచ్చి గ్రామంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.