నిర్లక్ష్యం చేస్తే నష్టం తప్పదంటున్న పశుసంవర్ధక శాఖ
ఈనెల 15 నుంచి వ్యాధి నివారణ ఉచిత టీకాలు
భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన పశ్చిమగోదావరి జిల్లాలో వరిసాగు తరువాత రైతులు ఎక్కువగా పశువుల పెంపకంపై ఆధారపడతారు. వేణ్నీళ్లకు చన్నీళ్లు సాయం అనే నానుడితో వ్యవసాయంతో పాటు పాడిపశువులను పెంచుతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను బట్టి పశువులకు గాలికుంటు వ్యాధి (పుట్ అండ్ మౌత్ డీసీజెస్) సోకే అవకాశముంది. ఈ వ్యాధి కారణంగా పాల దిగుబడి తగ్గిపోవడం, పనిసామర్ధ్యం తగ్గిపోయే ప్రమాదముంది. వ్యాధి సోకిన పశువుల పాలు తాగిన లేగ దూడలు చనిపోయే అవకాశం ఉంది. గాలికుంటు వ్యాధి తీవ్రమైన అంటువ్యాధి. ఇది పశువులకు, పందులకు, మేకలకు, గొర్రెలు వంటి జంతువులకు సోకుతుంది. ఈ వ్యాధికి కారణం పిక్కోర్నావిరిడే అనే వైరస్.
అధిక జ్వరం, నోట్లో పుండ్లు లక్షణాలు
గాలికుంటు వ్యాధి సోకిన పశువులకు అధిక జ్వరం వస్తుంది. పశువుల నోటి లోపల, నాలుకపై, చిగుళ్ళ, పెదవులపైన నీటి పొక్కులు ఏర్పడతాయి. ఇవి పగిలి పుండ్లుగా మారతాయి. దీని కారణంగా పశువులు మేత తినడానికి ఇబ్బంది పడతాయి. పశువుల పాదాల మధ్య, గాలికుంటుపైన, కాళ్ళ పైన నీటి పొక్కులు ఏర్పడి అవి పగిలి పుండ్లుగా మారి పశువులు నడవడానికి ఇబ్బంది పడతాయి. దీనివల్ల పశువులు కుంటుతూ నడుస్తాయి. అందుకే ఈ వ్యాధిని గాలికుంటు వ్యాధి అంటారు. నోట్లో పుండ్ల కారణంగా పశువులు నోటి నుంచి ఎక్కువగా లాలాజలాన్ని స్రవిస్తాయి.
పాలు ఉత్పత్తిపై ప్రభావం
పశువులు మేత సరిగా తినకపోవడం వల్ల వాటి బరువు తగ్గిపోతుంది. దూడలలో ఈ వ్యాధి గుండె కండరాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల గుండె పోటు వచ్చి మరణాలు సంభవించే అవకాశం ఉంది.
గాలికుంటు ఎలా వ్యాపిస్తుంది
వ్యాధి సోకిన పశువుల నుంచి ఆరోగ్యంగా ఉన్న పశువులకు నేరుగా వ్యాధి వ్యాపిస్తుంది. కలుషితమైన మేత, నీరు, పరికరాల ద్వారా వ్యాపిస్తుంది. అంతేకాకుండా గాలి ద్వారా కూడా ఈ వైరస్ కొంత దూరం వరకు వ్యాపిస్తుంది.
వ్యాధి చికిత్స, నివారణ
● ఈ వ్యాధి నివారణకు నిర్దిష్టమైన చికిత్స లేదు. సాధారణంగా వ్యాధి లక్షణాల ఆధారంగా చికిత్స చేయాలి.
● పుండ్లలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి యాంటీబయోటిక్స్ ఉపయోగించవచ్చు. నోట్లోని పుండ్లను శుభ్రం చేయడానికి పొటాషియం పర్మాంగనేట్ వంటి ద్రావణాలను ఉపయోగించాలి. పాదాల పుండ్లకు అయోడిన్ లేదా ఇతర యాంటిసెప్టిక్ ద్రావణాలను ఉపయోగించవచ్చు. వ్యాధి నివారించడానికి టీకాలు వేయించడం చాలా ముఖ్యం. పశువులకు ప్రతి ఆరు నెలలకొకసారి టీకాలు వేయించాలి. పాడి పశువులు ఉండే స్థలాన్ని శుభ్రంగా ఉంచాలి. పశువులను ఒకదానికొకటి దూరంగా ఉంచాలి.
15 నుంచి ఉచితంగా టీకాలు
పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు ఈనెల 15 నుంచి జిల్లా వ్యాప్తంగా ఉచితంగా టీకాలు వేస్తున్నారు. సుమారు 45 రోజులపాటు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో టీకాలు వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అనేక నష్టాలు ఏర్పడనున్నందున ఉచిత టీకాలను పాడి రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి.
పి.సుధీర్‌బాబు, ఏడీ, పశుసంవర్ధకశాఖ, భీమవరం

పశువుల్లో ప్రమాదకరంగా గాలికుంటు