ఉలిక్కిపడ్డ ట్రిపుల్‌ ఐటీ | - | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడ్డ ట్రిపుల్‌ ఐటీ

Sep 9 2025 6:44 AM | Updated on Sep 9 2025 6:44 AM

ఉలిక్కిపడ్డ ట్రిపుల్‌ ఐటీ

ఉలిక్కిపడ్డ ట్రిపుల్‌ ఐటీ

ప్రొఫెసర్‌పై దాడితో అప్రమత్తం

ఆందోళనలో ఫ్యాకల్టీ, నాన్‌టీచింగ్‌ సిబ్బంది

నూజివీడు: ట్రిపుల్‌ ఐటీలో పనిచేస్తున్న సీనియర్‌ ప్రొఫెసర్‌పై ఎంటెక్‌ విద్యార్థి కత్తితో దాడి చేయడంతో ట్రిపుల్‌ ఐటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక్కడ పనిచేస్తున్న మెంటార్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, గెస్ట్‌ ఫ్యాకల్టీ, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది అందరూ దాడి సంఘటనతో ఆందోళనకు గురయ్యారు. ఆర్జీయూకేటీకి గతంలో రిజిస్ట్రార్‌గా, నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి డైరెక్టర్‌గా, ఏఓగా, అడ్మిషన్ల కన్వీనర్‌గా పనిచేసిన సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌ ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజుపై ఎంటెక్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థి వినయ్‌ పురుషోత్తం కత్తితో దాడి చేయడాన్ని ఫ్యాకల్టీ, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌, మెంటార్ల యూనియన్‌లు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించాయి. ఒక విద్యార్థి జేబులో రెండు కత్తులు పెట్టుకొని తరగతి గదికి రావడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇలా అయితే తమకు రక్షణ ఏముంటుందని ఫ్యాకల్టీ ముక్తకంఠంతో ప్రశ్నిస్తోంది. 9,900 మంది విద్యార్థులున్న నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మున్ముందు తమ పరిస్థితి దారుణంగా ఉంటుందేమోననే ఆందోళన వ్యక్తం చేస్తోంది. దాడి జరిగింది తరగతి గదిలో కాబట్టి మిగిలిన విద్యార్థులందరూ వచ్చి నిలువరించారని, ఇదే సంఘటన ప్రొఫెసర్‌ కేబిన్‌లో జరిగి ఉంటే దాడి నుంచి ప్రొఫెసర్‌ను ఎవరు కాపాడేవారని ప్రశ్నిస్తున్నారు. ఇలంటి పరిస్థితుల్లో ఫ్యాకల్టీకి భద్రత డొల్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తరగతులకు హాజరుకాకుంటే ఏం చేస్తున్నారు?

ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడిన ఎంటెక్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థి వినయ్‌ పురుషోత్తం ప్రారంభం నుంచి తరగతులకు, ల్యాబ్‌లకు గానీ హాజరయ్యేవాడు కాదని ట్రిపుల్‌ ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. రెసిడెన్షియల్‌ విధానంలో నిర్వహిస్తున్న ట్రిపుల్‌ ఐటీలో తరగతులకు రాకుండా హాస్టల్‌ గదిలోనే ఉంటున్నప్పుడు పరిపాలన చేసే అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హెచ్‌ఓడీ, డీన్‌ అకడమిక్స్‌, డైరెక్టర్‌లు నిత్యం గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి ఎందుకు గైర్హాజరవుతున్నారో తెలుసుకొని ఆ విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ అలా చేసిన దాఖలాలు లేవు. ఈ విద్యార్థి తన రూమ్‌లో ఉండే మరికొందరు విద్యార్థులతో కూడా మాట్లాడకుండా ఉంటాడని పలువురు పేర్కొంటున్నారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులు సహజంగా పండ్లు కోసుకోవడానికి ఇంటి వద్ద నుంచే చాకులు తెచ్చుకుంటారు. అయితే ఇతను రెండు చాకులను జేబులో పెట్టుకొని తరగతి గదికి రావడాన్ని బట్టి చూస్తుంటే దాడి చేయాలనే లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా తెచ్చుకున్నట్లుగా ఉందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా యాజమాన్యం కఠినంగా వ్యవహరించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement