
దళిత కుటుంబాలకు పరామర్శ
కై కలూరు: దానిగూడెం దళితులపై దాడి నేపధ్యంలో కై కలూరు పట్టణంలో నాలుగు రోజులుగా పోలీసులను మెహరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినప్పటకీ ప్రధాన సూత్రదారుడిని అదుపులోకి తీసుకోవాలంటూ దళిత నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నియోజకవర్గం, ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 150 మంది దళిత యువకులు పోలీసుల వలయాన్ని చేధించుకుని దానిగూడెం చేరుకున్నారు. దానిగూడెం ప్రజలు వంటా, వార్పుతో మద్దతు తెలపడానికి వచ్చిన వారికి భోజనాలు అందించారు. డీఎస్పీ, పలువురు సీఐలు, ఎస్‌ఐలు కలిపి దాదాపు 200 మంది పోలీసులు విధులు నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. సంక్షేమం లేదు.. రోజు రోజుకు దళితులు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీ కులాలపై అత్యాచారాలు, హత్యలు, అరాచకాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. దానిగూడెంకు పోలీసులు వెళ్ళనీయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కీలక వ్యక్తులను అరెస్టు చేసి అందరిపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దళితులపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతోందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్వీనర్ ఉప్పులేటి దేవీ వరప్రసాద్ విమర్శించారు. ఇటీవల తెనాలి, తణుకు, ఇప్పుడు కై కలూరులో దళితులపై దాడులు జరిగాయన్నారు. రోడ్డుపై ఆందోళనలు చేశారంటూ దళితులపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలన్నారు. ప్రధాన నిందితుడు కొల్లి బాబీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మాలమహాడు రాష్ట్ర అధ్యక్షుడు నాగ జగన్ బాబూరావు, కృష్ణాజిల్లా మాలమహానాడు అధ్యక్షుడు దోవా గోవర్థన్, దళిత నాయకులు పాల్గొన్నారు. సున్నితమైన అంశంపై కావాలని ఘర్షణలకు పాల్పడితే సహించమని డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ హెచ్చరించారు. 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. దళితులపై దాడి కేసులో ఇప్పటికే అరెస్టులు చేసి రిమాండ్‌కు పంపామన్నారు. మరొకరిపై ఆరోపణలను నిర్ధారణ చేసుకుని చర్యలు తీసుకుంటామన్నారు.
కై కలూరులో 144 సెక్షన్,
భారీగా పోలీసుల మోహరింపు