
పరిహారం లేదు.. పథకమూ అందదు
ముంపులేని భూమిని ఎలా సాగుచేసేది?
ఆన్‌లైన్‌లో చూపించడం లేదు
డ్రిప్‌కు దరఖాస్తు చేసుకోలేక పోతున్నాం
● కూటమి ప్రభుత్వ నిర్వాకం
● ఘొల్లుమంటున్న విలీన మండలాల రైతులు
కుక్కునూరు: రాష్ట్రంకోసం.. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన విలీన మండలాల రైతులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పోలవరం ముంపు పేరుతో అటు అభివృద్ధి పనులు చేయకుండా, ఇటు పరిహారం ఇవ్వకపోవడమే కాకుండా ప్రభుత్వ పథకాలు కూడా వారికి అందకపోవడంతో నిర్వాసితులు తామేం పాపం చేశామని వాపోతున్నారు. రైతుకు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న అన్నదాత సుఖీభవ రూ.7 వేలు ఆర్థిక సాయం గత ప్రభుత్వం పట్టాదారు లేకపోతే వారి వారసులకు అందించగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నామినీలను అనర్హులుగా పేర్కొంది. ఆ తరువాత రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో మరలా వారంరోజులు సమయం ఇచ్చి ఆన్‌లైన్ చేయించుకునే అవకాశం కల్పించింది. దీంతో చాలా మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి దూరమయ్యారు.
ఎల్‌టీ అగ్రికల్చర్ కలెక్షన్లు లేవు
ప్రభుత్వం వ్యవసాయం కోసం అందించే ఎల్‌టీ అగ్రికల్చర్ కనెక్షన్‌ను తాజాగా రైతులకు దూరం చేసింది. గత జనవరి వరకు ప్రభుత్వం కొత్త అగ్రికల్చర్ కనెక్షన్‌లు మంజూరు చేయగా ప్రస్తుతం ఎల్‌టీ అగ్రికల్చర్ కనెక్షన్ కొరకు స్థానిక సబ్‌స్టేషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెళ్లిన రైతులకు వెబ్‌ల్యాండ్ ఫ్రీజ్‌లో ఉండడంతో ఆధార్ కార్డ్ నెంబర్‌లు టైప్ చేస్తే ఆన్‌లైన్‌లో ఎటువంటి డేటా చూపించడంలేదని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. దీంతో రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించి పోలవరం భూసేకరణ పూర్తికాగా ఇంకా ముంపునకు గురికాని భూములు దాదాపు 50 శాతంకు పైగా ఉన్నాయి. ఇప్పుడు ఆ భూ యజమానులు మా భూములకు పరిహారం అయినా అందించండి లేకపోతే సాగు చేసుకునేందుకు విద్యుత్ కనెక్షన్ అయినా అందించాలని కోరుతున్నారు. అంతేకాక రాష్ట్రమంతా ఓ న్యాయం మాకో న్యాయమా అని బహిరంగంగానే కూటమి ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు.
బిందు సేద్యం దూరం
ప్రభుత్వం ఉద్యాన రైతులకు అందించే బిందు సేద్యాన్ని కూడా విలీన రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందు సేద్యం చేస్తున్న గిరిజనేతర రైతులకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇస్తుండగా, గిరిజన రైతులకు వందశాతం సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం బిందు సేద్యం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌ల్యాండ్ ఫ్రీజింగ్ కారణంగా జియోట్యాగింగ్ చేసుకునేందుకు పలు గ్రామాల పేర్లు చూపించకపోవడంతో రైతులకు బిందు సేద్యానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
నాకు కివ్వాక గ్రామంలో 2.5 ఎకరాల సాగు భూమి ఉంది. సదరు భూమి ముంపులో లేదు. ఆ భూమిలో సాగు చేసుకునేందుకు అగ్రికల్చర్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకుందామంటే విద్యుత్ సిబ్బంది ఆన్‌లైన్ చేసేందుకు మీ గ్రామం సైట్‌లో చూపించడంలేదంటున్నారు. మా భూములకు పరిహారం అయినా ఇవ్వండి లేదంటే విద్యుత్ కనెక్షన్‌కు అవకాశం కల్పించండి.
– పగిళ్ల ప్రసాద్, కివ్వాక, కుక్కునూరు మండలం
వ్యవసాయ విద్యుత్ మోటార్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే రైతుల ఆధార్ వివరాలు కుక్కునూరు మండల వెబ్ ల్యాండ్ ఫ్రీజింగ్‌లో ఉండడంతో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆన్‌లైన్‌లో రైతుల వివరాలు చూపించడం లేదు. దీంతో రైతులకు కొత్త కనెక్షన్ పొందే అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలి.
– ఎంఎం పాపారావు, అసిస్టెంట్ ఇంజనీర్, కుక్కునూరు
మా భూములకు సంబంధించి వెబ్ ల్యాండ్ ఫ్రీజింగ్‌లో ఉండడంతో మిర్చి తదితర పంటలకు డ్రిప్ వేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ముంపులో లేని భూములకు పథకాలు వర్తింపజేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
– మచ్చా రాజులు, ఇసుకపాడు, కుక్కునూరు మండలం

పరిహారం లేదు.. పథకమూ అందదు

పరిహారం లేదు.. పథకమూ అందదు