
పీ–సెట్ నోటిఫికేషన్ విడుదల
దెందులూరు: ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీ సెట్) నోటిఫికేషన్ నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసిందని గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.నతానియేలు అన్నారు. ఆదివారం వ్యాయామ కళాశాలలో ఆయన మాట్లాడుతూ బీపీఈడీ, డీపీఈడీ కోర్సులలో అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవటానికి గడువు ఉందన్నారు.
ముసునూరు: మద్యం మత్తులో కింద పడడంతో తలకు తీవ్రగాయమై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని రమణక్కపేటకు చెందిన తోట మురళీకృష్ణ(31) శనివారం సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అర్థరాత్రి మూత్ర విసర్జనకు బయటకు వస్తూ, తూలి గచ్చుపై పడ్డాడు. గచ్చు కోణం తలకు తగలడంతో తీవ్రంగా గాయపడి, అధిక రక్తస్రావమైంది. క్షతగాత్రుడిని బంధువులు నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
ద్వారకాతిరుమల: మండల కేంద్రమైన ద్వారకాతిరుమలలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మొదలైన వర్షం అరగంట పాటు ఏకధాటిగా పడింది. దాంతో డ్రైనేజీలు పొంగి పొర్లడంతో మురుగు, చెత్తాచెదారం రోడ్లపైకి చేరింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండపై నుంచి లింగయ్య చెరువులోకి భారీగా నీరు ప్రవహించింది.
పెనుగొండ: పౌర్ణమి సందర్భంగా ఆదివారం గోదావరి మాతకు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో హరతులనిచ్చారు. కలగభద్రుడు అర్చకత్వంలో ఏకముఖ, ద్విముఖ, చతుర్థ, పంచమ, కుంభ, నక్షత్ర, పూర్ణ, కుంభ, సర్ప హారతులనిచ్చారు. కార్యక్రమంలో హిందూ ధర్మ సమితి సభ్యులు పాల్గొన్నారు.

పీ–సెట్ నోటిఫికేషన్ విడుదల