
ట్రంప్ పెత్తనాన్ని తిప్పికొట్టాలి
భీమవరం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై చేస్తున్న పెత్తనాన్ని తిప్పికొట్టాలని, భారత్‌పై సుంకాల పేరుతో సాగిస్తున్న కక్ష సాధింపులను విరమించుకోవాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు కోనాల భీమారావు, జేఎన్‌వీ గోపాలన్ డిమాండ్ చేశారు. భారత దిగుమతులపై ట్రంప్ భారీగా సుంకాలు విధించడాన్ని నిరసిస్తూ స్థానిక ప్రకాశం చౌక్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. సుంకాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి తేవాలన్నారు. అమెరికా సుంకాలతో ఆక్వా, ఫార్మా, ఆటోమొబైల్ ఇలా పలు రంగాలు కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించడానికి కూటమి ప్రభుత్వం కూడా ఏ మాత్రం నిరసన వ్యక్తం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి, ఎంసీపీయూ నాయకుడు జి.రాంబాబు, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన